జగన్ పాలనలో ఏపీలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కమ్మ సామాజిక వర్గంపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కమ్మ సంఘం సమావేశాల్లో సీనియర్ అయిన వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదన్నారు. గత టిడిపి హయంలో మైనార్టీ , ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని... ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని కొడాలి నాని పేర్కొన్నారు. ఒక్క కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వలేదనడం సరికాదని.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే పదవులు కేటాయించాలని ఆయన సూచించారు.
కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందే ఉందన్న ఆయన.. ఎన్టీఆర్‌ను కమ్మ వర్గానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న తేవడంలో విఫలమైన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరని ఆయన నిలదీశారు. రాష్ట్రంలోని 105 కులాల్లో , ఏ ప్రభుత్వం వచ్చినా పది లేదా పన్నెండు కులాలకే మంత్రి వర్గంలో ప్రాధాన్యం దక్కుతోందని కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 90 బీసీ కులాల్లో ఎంతమందికి మంత్రి పదవులు దక్కాయని ఆయన ప్రశ్నించారు.
ALso REad:ఎన్టీఆర్ వారసులు చంద్రబాబుని తరిమికొట్టడం ఖాయం..: కొడాలి నాని సంచలనం
కాగా.. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలో వసంత నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ఎవరూ అడ్డుకోలేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర కేబినెట్‌లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లేకపోవడంపై వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగున వున్న తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వున్నారని ఆయన గుర్తుచేశారు. ఇతర సామాజిక వర్గాల పల్లకీలను ఇంకెంత కాలం మోస్తారని వసంత నాగేశ్వరరావు ప్రశ్నించారు.
