కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ఓ గుర్తింపు ఉంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో దాదాపు 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

కానీ మంత్రిమాత్రం కాలేకపోయారనే సానుభూతి ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉన్నప్పటికీ ఆయన మంత్రి కాలేకపోయారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆయన గెలుపు నల్లేరుపై నడకేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈసారైనా ఆయన మంత్రి అవుతారా అన్న ప్రశ్న కర్నూలు జిల్లా వాసులను తొలచివేస్తుందట. 

ఇంతకీ ఆ నాయకుడు ఎవరనుకుంటున్నారా ఇంకెవరు కాటసాని రాంభూపాల్ రెడ్డి. రాజకీయాల్లో కాటసాని సీనియర్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆయన 8 సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే 5 సార్లు గెలిచారు. ఈసారి గెలిస్తే ఆరోసారి గెలవనున్నట్లు. 

అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని వైసీపీ వర్గాలు ధీమాతో ఉన్నాయి. ఈసారి మంత్రి పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సీనియర్ కోటాలో ఆయన మంత్రి పదవి దక్కించుకుంటారంటూ ప్రచారం జరుగుతుంది. 

కాటసాని రాంభూపాల్ రెడ్డికి వరుసకు సోదరుడు కాటసాని రామిరెడ్డి ఇద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాటసాని రామిరెడ్డి 2014కు కంటే ముందే వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బీసీ జనార్థన్ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల అనంతరం కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. 

ఆనాటి నుంచి ఎన్ని ఒత్తిడిలు ఉన్నప్పటికీ వైసీపీని మాత్రం వదల్లేదు. వైఎస్ జగన్ అడుగుజాడల్లోనే నడిచారు వీరంతా. రాజకీయాల్లో సీనియారిటీతో పాటు సిన్సియారిటీ ఉన్న నేతగా కాటసాని రాంభూపాల్ రెడ్డికి పేరు ఉండటంతో ఆయనకు ఈసారి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.