అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తామని టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి. ఎన్నికల అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. 

గుంటూరులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాడులపై శ్రీరంగ నీతులు చెప్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ దాడులకు పాల్పడుతూ వైసీపీపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు అండ్ కో ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. గుంటూరు జిల్లాలోని పోలీసులు టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.