Asianet News TeluguAsianet News Telugu

మీ దరిద్రమే మమ్మల్ని వెంటాడుతోంది: లోకేష్, చంద్రబాబులపై జోగి రమేష్ ఫైర్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నారా లోకేష్ ఒకటి గుర్తుంచుకోవాలంటూ హితవు పలికారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాజధాని నడిబొడ్డున ఇల్లు కట్టుకుని ఉంటున్నారని వైసీపీ రాష్ట్ర కార్యాలయం కూడా రాజధాని నడిబొడ్డులో ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇల్లు ఉందా, కనీసం పార్టీ కార్యాలయమైనా ఉందా అంటూ నిలదీశారు. మీ దరిద్రంతోనే ప్రపంచ బ్యాంకు వెనకడుగు వేసిందంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ సెటైర్లు వేశారు. 

ysrcp mla jogi ramesh serious comments on nara lokesh
Author
Amaravathi, First Published Jul 20, 2019, 3:06 PM IST

అమరావతి : మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. లోకేష్ కు మతి భ్రమించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లే పిచ్చికూతలు కూస్తున్నాడని విమర్శించారు. 

సీఎం వైయస్ జగన్ వ్యవహారశైలి వల్లే రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గిందని నారా లోకేష్ తోపాటు టీడీపీ ఆరోపించడాన్ని ఆయన ఖండించారు.  చంద్రబాబు నిర్వాకం వల్లే అది వెనక్కి వెళ్లిందని విరుచుకుపడ్డారు. 

జగన్ పాలనను తుగ్లక్ పాలన అంటూ పిచ్చి కూతలు కూస్తున్న లోకేష్ అసలైన తుగ్లక్ చంద్రబాబు నాయుడేనని చెప్పుకొచ్చారు. తుగ్లక్‌ పాలనకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 45 రోజుల్లోనే సీఎం జగన్ ప్రజల మనుసు గెలుచుకున్నారని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల  పాలన తుగ్లక్ పాలన అయితే ప్రస్తుతం జరుగుతున్న పాలన రాజన్న పరిపాలన అంటూ చెప్పుకొచ్చారు. 

ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పిన బాబు అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారంటూ ఘాటుగా విమర్శించారు. నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి తర్వాత అమరావతిని ఎందుకు ఎంచుకున్నారో ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు.  

అనుయాయులు, ఎల్లోమీడియాతో విస్తృత ప్రచారం చేయించి నూజివీడులో భూములు కొనుగోలు చేసేలా చేసి అనేక మందిని మోసం చేశారని ఆరోపించారు. భూములు ఇవ్వని రైతుల ఇంటికి అధికారులు, మంత్రులను పంపి భయభ్రాంతులకు గురి చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు.  

ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 33 వేల ఎకరాల భూమిని సేకరించిన చంద్రబాబు రైతులకు ఎలాంటి లబ్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. అమరావతి నిర్మాణమే భ్రాంతి అన్నట్లు గా మార్చి భ్రమరావతిగా చూపెట్టారని విమర్శించారు. 

విఠలాచార్య సినిమాల్లో సెట్టింగుల్లా బాహుబలి గ్రాఫిక్స్‌ చూపించారని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా ప్రచార ఆర్భాటాలే తప్ప ఐదేళ్ల పాలనలో కనీసం రాజధానికి సరైన రహదారి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడ్డారు.  

అమరావతి నిర్మాణ విషయంలో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయని, సామాజిక న్యాయం జరగలేదని ప్రపంచబ్యాంకు జూన్‌ 12న ఓ లెటర్‌ను వారి వెబ్‌సైట్‌లో పొందుపరిచిందని తెలిపారు. రాజధాని నిర్మాణం నుంచి తప్పుకుంటున్నామని జూలై 17 స్పష్టం చేసిందన్నారు. 

సామాజిక న్యాయం జరగలేదని లెటర్ వెబ్ సైట్ లో పెట్టిన నాటికి వైసీపీ ప్రభుత్వం వచ్చి కేవలం 12 రోజులే అవుతుందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వల్లే ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడం లేదంటూ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా అని నిలదీశారు.  

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నారా లోకేష్ ఒకటి గుర్తుంచుకోవాలంటూ హితవు పలికారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాజధాని నడిబొడ్డున ఇల్లు కట్టుకుని ఉంటున్నారని వైసీపీ రాష్ట్ర కార్యాలయం కూడా రాజధాని నడిబొడ్డులో ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇల్లు ఉందా, కనీసం పార్టీ కార్యాలయమైనా ఉందా అంటూ నిలదీశారు. మీ దరిద్రంతోనే ప్రపంచ బ్యాంకు వెనకడుగు వేసిందంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ సెటైర్లు వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios