తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. కృష్ణానదిలో వరద ప్రశాంతంగా ముగిసిందని కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల బురద రాజకీయాలు మాత్రం ఆగలేదని విమర్శించారు. చంద్రబాబు భజనపరులు నిత్యం రాజకీయాలతోనే పబ్బం గడుపుతున్నారంటూ మండిపడ్డారు.

అక్రమ కట్టడంలో ఉండటం తప్పని తెలిసి కూడా చంద్రబాబు అందులోనే ఉండటంపై మండిపడ్డారు. వరద, ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి డ్రోన్‌ ఉపయోగిస్తే తప్పేంటని చెప్పుకొచ్చారు. 

టీడీపీ అధినేత చంద్రబాబును హత్య చేయడానికే డ్రోన్‌లు వాడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. డ్రోన్ల వినియోగంపై దేవినేని ఉమా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబును ప్రజలు ఎప్పుడో హత్య చేసి 23 అడుగుల గొయ్యిలో పాతేశారని జోగి రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా హత్యకు కుట్ర ఏంటంటూ మండిపడ్డారు. 

మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఏమన్నా అయితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న బుద్దా వెంకన్న బుద్దిలేని వెంకన్న అంటూ విమర్శించారు. బుద్ధిలేని వెంకన్నను ముందు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జోగి రమేష్. 

ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు రోడ్డు మీద వెళ్తుంటే పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమాలు నోరు అదుపులో పెట్టుకోవాలని జోగి రమేష్ హెచ్చరించారు.   

సీఎం వైయస్ జగన్‌ తన సొంత ఖర్చులతో అమెరికా వెళ్లారని.. చంద్రబాబులా విందు, వినోదాలకు కాదని స్పష్టం చేశారు. జగన్‌ విదేశీ పెట్టుబడుల కోసం తాపత్రయ పడుతున్నారని అందులో ఎలాంటి స్వార్థం లేదన్నారు. 

చంద్రబాబు రాజకీయ జీవితంలో చిత్తశుద్ధికలిగిన కార్యకర్తలను తయారు చేసుకోకుండా కోవర్టులను తయారు చేసుకున్నారంటూ విమర్శించారు. ఆ కోవర్టుల్లో కొందరు బీజేపీలో చేరి చంద్రబాబు గొంతు వినిపిస్తున్నారని మండిపడ్డారు. 

ఈ సందర్భంగా మాజీమంత్రి నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డంగా పెట్టాలని లోకజ్ఞానం లేని లోకేష్ ట్విట్లు చేస్తున్నాడని రమేష్‌ సెటైర్లు వేశారు. చంద్రబాబు కనీసం వారానికొకసారైనా లోకేష్‌కు రాజకీయ జ్ఞానం నేర్పాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ సూచించారు.