14 ఏళ్ల హయాంలో లక్షా 20 వేల ఉద్యోగాలు చేయలేని దద్దమ్మ చంద్రబాబని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్. ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ తన 100 రోజుల పాలనలోనే లక్షా 27 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని ప్రశంసించారు.

చంద్రబాబు ఏనాడు ఏపీపీఎస్సీ ద్వారా లక్ష ఉద్యోగాలు భర్తీ చేశారా అని రమేశ్ ప్రశ్నించారు. పేదలకు ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్షం చూడలేకపోతోందని ఆయన ఎద్దేవా చేశారు.

గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 20 లక్షల మంది హాజరయ్యారని జోగి రమేశ్ తెలిపారు. జగన్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని పిల్లలు, వారి తల్లిదండ్రులు నమ్ముతున్నారని ఇలాంటి పరిస్ధితుల్లో ప్రభుత్వంపై బురద జల్లాలని చంద్రబాబు యత్నిస్తున్నారని రమేశ్ ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మనోభావాలను వేమూరి రాధాకృష్ణ దెబ్బతీశారని ఆయనను ఖబద్దార్ అంటూ హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి పేపర్‌కు లీకైన ప్రశ్నపత్రం ఎలా వచ్చిందో రాధాకృష్ణ చెప్పాలని రమేశ్ డిమాండ్ చేశారు. సరైన సమాధానం చెప్పకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుని సమాజంలో 420గా నిలబెడతామని రమేశ్ హెచ్చరించారు.