అమరావతి: మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. చంద్రబాబు దొంగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు. 

చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు పదేపదే విస్త్రతంగా ప్రచారం చేసి నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపించారు. 

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు వస్తే జాబు వస్తుందనే హామీని గాలికొదిలేశారని ఆరోపించారు. కేవలం చంద్రబాబు తనయుడు  నారా లోకేష్ కు తప్ప ఇంకెవరికి ఉద్యోగం రాలేదన్నారు. చంద్రబాబు హయాంలో నారా లోకేష్ ఒక్కడే స్పెషల్ కేటగిరీలో మంత్రి పదవి పొందారన్నారు. 

మరోవైపు చంద్రబాబు నాయుడు హయాంలో వందలాది మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత సైతం ఆత్మహత్యలు చేసుకోవడం చూసిన ఘటనలు కోకొల్లలు అని చెప్పుకొచ్చారు.  

మరోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించాలని సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల తరపున జక్కంపూడి రాజా సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.