విశాఖపట్టణం:  విశాఖ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను టీడీపీ దెబ్బతీస్తోందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ చెప్పారు.

గురువారం నాడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లడారు. విశాఖ అభివృద్ధిని దెబ్బతీసేందుకు టీడీపీ నేతల వాఖ్యలు వారి కుట్రలకు తార్కాణంగా నిలుస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

ఘన చరిత్ర కలిగిన విశాఖను అభివృద్ధి చేసి రాజధాని హోదాతో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి  చేస్తున్న కృషిని టీడీపీ దుయ్యపట్టడం సిగ్గు చేటన్నారు.

కులమత విభేదాలు లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవిస్తున్న ప్రజల్లో కల్లోలాన్ని సృష్టించేందుకు చంద్రబాబు పన్నుతున్న కుయక్తులు సాగవన్నారు.
విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు.బులెట్ ట్రైన్ మాదిరిగా అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న విశాఖపై ఎంతమంది బురదజల్లాలని చూసినా ఆ పప్పులు తమదగ్గర ఉడకవన్నారు.

22 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు.రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలను సైతం పక్కన పెట్టి స్వార్ధపురితమైన ఆలోచనలతో కుతoత్రాలు పన్ని అమరావతి ప్రాంతంలో అర్ధరహితమైన జోన్లు ఏర్పాటు చేసిన కుట్రనాయకుడు చంద్రబాబు అని ఆయన విమర్శించారు.