పెగాసస్ వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇలాంటి వ్యవస్థలను దేశ భద్రతకే ఉపయోగిస్తాం తప్పించి.. వ్యక్తిగత ప్రయోజనాలకి ఉపయోగించమన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్.

స్పై వేర్లు వాడడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ (gudivada amarnath) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంఘవిద్రోహ శక్తులపై నిఘా వేయడానికి, భద్రతా పరమైన చర్యల కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కొన్ని సాఫ్ట్‌వేర్లను వాడడం సహజమన్నారు. కానీ, ఇలాంటి వ్యవస్థలను వ్యక్తిగత అంశాలపై నిఘా కోసం ఉపయోగించడాన్ని తాము తప్పుబడుతున్నామని అమర్‌నాథ్ పేర్కొన్నారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఉన్న చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు సజ్జల ఫోన్ ట్యాపింగ్ చేశారన్న అంశంపై తాము కోర్టుకు కూడా వెళ్లామని గుడివాడ అమర్‌నాథ్ గుర్తుచేశారు. ఇలాంటి సాఫ్ట్‌వేర్లను ఓ ప్రభుత్వం ఉపయోగిస్తే, ఆ రాష్ట్ర భద్రత కోసమో, ప్రభుత్వ భద్రత కోసమో వాడాలి తప్ప, రాజకీయాల కోసం వాడడం సమంజసం కాదని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు తన భార్యతో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన కొడుకు, కోడలు ఏం మాట్లాడుకుంటున్నారు? అనే విషయాలపై నిఘా వేసే ఛండాలపు బుద్ధి వైసీపీ ప్రభుత్వానికి లేదు అని అమర్‌నాథ్ పేర్కొన్నారు.

కాగా... ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) పెగాసస్ ‌విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. పెగాసస్‌పై ఏ విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. బాబాయ్ హత్య విషయంలోనూ, మద్యం మరణాలపైనా విచారణ చేయగలరా అని వైసీపీ ప్రభుత్వాన్ని లోకేష్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసర్ గురించి మాట్లాడారా..? లేదా..? అనే స్పష్టత లేదని లోకేష్ పేర్కొన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పాడంటూ పేర్కొన్నారు.

ఇక, Pegasusపై హౌస్ కమిటీతో విచారణ జరిపిస్తామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaram సోమవారం శాసనసభలో ప్రకటించారు. ఈ విషయమై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఇతర సభ్యులు కోరిన మీదట హౌస్ కమిటీ విచారణకు స్పీకర్ ఆదేశించారు. పెగాసెస్ అంశంపై ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు చర్చ జరిగింది. ఈ చర్చలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranathపాల్గొన్నారు. Chandrababu Naidu పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం Mamata Benarjee అసెంబ్లీలోనే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కచ్చితమైన సమాచారం ఉండి ఉంటేనే మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన గుర్తు చేశారు.

పెగాసెస్ వంటి స్పైవేర్ తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ సాఫ్ట్ వేర్ తో వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకొనే అవకాశం కూడా ఉందన్నారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్ గానే చేస్తారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇది ప్రమాదమే కాదు అనైతికం కూడా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇలాంటి ప్రమాదకర సాఫ్ట్‌వేర్ ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గమన్నారు.పెగాసెస్‌తో ఏమేమీ చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.