కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించారు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడో విడత లాక్‌డౌన్‌లో ఉన్నామని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాంతాలను మూడు కేటగిరీల కింద విభజించి సడలింపులు ఇచ్చిందన్నారు ధర్మాన.

ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఏపీ ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు దీర్ఘకాలిక చర్యలు ప్రణాళికబద్ధంగా చేపడుతోందని ప్రసాదరావు అన్నారు. ఏపిలో కరోనా నిర్ధారణ టెస్టులు భారీగా జరుగుతున్నాయని, ప్రతి 50 కుటుంబాలను వాచ్ చేసే వాలంటీర్‌ను నియమించడం ద్వారా అతను అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అనుమానితులను గుర్తించగలిగామని ధర్మాన చెప్పారు.

అనుమానితులందరికి ప్రభుత్వం నిర్ధారణ పరీక్షలు చేయిస్తోందని, రోజుకు 60 నుంచి 70 పాజిటివ్ కేసులు  వస్తున్నాయని కొందరు విమర్శలు చేస్తున్నారని.. అయితే పెద్ద సంఖ్యలో నిర్థారణ పరీక్షలు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని ప్రసాదరావు  తేల్చి చెప్పారు.

Also Read:కోవిడ్ 19 నియంత్రణపై జగన్ సమీక్ష: వలస కూలీలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతపై ఆరా

ప్రతి రోజూ ఆరు నుంచి ఎనిమిది వేల మందిని పరీక్షిస్తే 60, 70 కేసులు వస్తున్నాయని.. ఇది ఆహ్వానించాల్సిన చర్యని ధర్మాన తెలిపారు. అనుమానితులందరికీ పరీక్షలు చేయించడం వల్ల ఆ ప్రాంతంలో ఎవరెవరికీ కరోనా సోకిందో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.

దక్షిణ కొరియా దీనిని ఆచరించబట్టే కరోనాపై వేగంగా పట్టు సాధించగలిగిందని ధర్మాన గుర్తుచేశారు. దురదృష్టంకొద్ది మన రాష్ట్రంలో ప్రతిమాటలోనూ విమర్శించాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలను ప్రజలను తప్పుదారి పట్టించి విజయం సాధిస్తాయనుకోవడం సరికాదని ధర్మాన అభిప్రాయపడ్డారు.

కరోనా నియంత్రణలో జగన్ సరైన డైరెక్షన్‌లోనే వెళ్తున్నారని ధర్మాన చెప్పారు. 45 రోజులు లాక్ డౌన్ లో ఉంటే ప్రజలకు అవసరమైన రేషన్ మూడుసార్లు ప్రతి ఇంటికి అందించిన విషయం వాస్తవం కాదా...? అని ఆయన ప్రతిపక్షాన్ని విమర్శించారు. ఈ విపత్తు కాలంలో ప్రభుత్వ పనితీరుపై తాను చర్చకు సిద్ధమని.. ఎవరైనా రావొచ్చని ధర్మాన సవాల్ విసిరారు.

గతంలో తెలుగుదేశం జెండా ఉంటే వాడికి రేషన్ ఇచ్చేవాళ్లని.. లేకపోతే లేదని ఆయన విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రాకముందు వచ్చిన ఓ తుఫానులో శ్రీకాకుళం సర్వనాశనం అయిపోతే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డబ్బు పంచుకునే కార్యక్రమం చేశారని ధర్మాన ఎద్దేవా చేశారు.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: మద్యం కోసం తమిళనాడు నుండి కుప్పానికి మందు బాబులు

గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారులను రాష్ట్రానికి తెచ్చేందుకు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ప్రసాదరావు స్పష్టం చేశారు. జగన్ మనసున్న వ్యక్తని, అందుకే క్వారంటైన్ సెంటర్లలో ప్రజలకు మంచి భోజనం, వసతులు ఏర్పాటు చేశారని ధర్మాన ప్రశంసించారు.

మద్యం గురించి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని.. కానీ రాష్ట్రంలో ఈ పరిస్ధితికి కారణం తెలుగుదేశం నేతలే అన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని ప్రకటించారని కానీ చంద్రబాబు దానిని తిరిగి ప్రవేశపెట్టారని ధర్మాన గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మద్యపానాన్ని దశలవారీగా తగ్గించే ప్రయత్నం చేస్తోందని.. అందులో భాగంగానే బార్లు, వైన్ షాపులు తగ్గించారని ప్రసాదరావు తెలిపారు.