రాష్ట్రంలో కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సర్వేలో 32,792 మందికి రేపటిలోగా టెస్టులు పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వెల్లడించారు.

అయితే రెడ్‌జోన్లలో ఉన్న ఆసుపత్రుల్లో ఖచ్చితమైనన మెడికల్ ప్రోటోకాల్ పాటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో వెరీ యాక్టీవ్ క్లస్టర్లు 65, యాక్టీవ్ క్లస్టర్లు 86, డార్మింటరీ క్లస్టర్లు 46, గత 28 రోజులుగా కేసుల్లేని క్లస్టర్లు 50 అని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

టెలిమెడిసిన్ వ్యవస్థ బలోపేతం కావాలని జగన్ అన్నారు. కీలకమైన కాల్‌ సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. దిశ, టెలిమెడిసిన్, అవినీతి నిరోధానికి సంబంధించిన ఏసీబీ, వ్యవసాయం తదితర కీలక నంబర్లను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు అందుబాటులో ఉంచాలన్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: 108, 104 వాహనాల్లో వెంటిలేటర్లు, అత్యాధునిక వైద్య సదుపాయాలు

మరోవైపు వలసకూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులు, గ్రూపుల వ్యవహరంపైనా ముఖ్యమంత్రి చర్చించారు. వెబ్‌సైట్‌ ద్వారా అప్లైచేసుకున్న వారిని పరిశీలించిన తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిస్తామన్నారు.

కేంద్ర హోంశాఖమార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి వచ్చే వాళ్లు ఎక్కడనుంచి వస్తున్నారు, ఆయారాష్ట్రాల్లో వాళ్లు గ్రీన్‌జోన్లో ఉన్నారా? ఆరెంజ్‌ జోన్లో ఉన్నారా? రెడ్‌ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు

స్పందన వెబ్‌సైట్‌ ద్వారానే కాక వివిధ మార్గాలద్వారా విజ్ఞప్తులు చేసుకున్నవారు కూడా ఉన్నారని అధికారులు సీఎంకు వెల్లడించారు. వ్యక్తిగతంగా వచ్చే వారిని ఎట్టిపరిస్ధితుల్లోనూ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని సీఎం సూచించారు.

అలాగే.. ఎంఫాన్‌ తుపాను ఏపీ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని జగన్ అధికారులకు సూచించారు. తుపాను కదలికల్ని గమనించాలని, విద్యుత్తు, రెవిన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలని వెల్లడించారు.

Also Read:ఏపీలో కరోనా ఉగ్రరూపం... తాజాగా మరో 67 పాజిటివ్ కేసులు

ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రతి పంటలో మూడింట ఒక వంతు పంటను మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధం కావాలన్నారు. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుందని సీఎం వెల్లడించారు.