అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత, అచ్చెన్నాయుడుపై చేసిన వ్యాఖ్యలు ఏపీ సభలో  తీవ్ర దుమారానికి కారణమైంది. అచ్చెన్నాయుడును బంట్రోతు అని వ్యాఖ్యానించినందుకు గాను క్షమాపణ చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.ఈ విషయమై సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది.

గురువారం నాడు  ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ను ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు చెప్పే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను ఎన్నుకొన్నందుకుగాను అభినందిస్తూ  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రసంగించారు.

ఈ సమయంలో  స్పీకర్ స్థానం వరకు విపక్షనాయకుడు రాకపోవడంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో  చంద్రబాబునాయుడు తన బంట్రోతు‌ను స్పీకర్ స్థానంలో తమ్మినేని సీతారాం కూర్చోబెట్టేందుకు పంపారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేగింది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై  చేసిన వ్యాఖ్యలపై  విపక్ష నేత చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని  చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.

అధికార పార్టీ మాత్రం ఐదేళ్ల క్రితం ఘటనలను మాత్రమే ప్రస్తావిస్తోందన్నారు. తాము మాత్రం చరిత్ర గురించి ప్రస్తావించకూడదని చెబుతోందని చంద్రబాబునాయుడు చెప్పారు.  ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు. సభలో తన కళ్ల ముందు జరిగిన ఘటననే చంద్రబాబునాయుడు తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాం ను  స్పీకర్ స్థానంలో కూర్చొబెట్టేందుకు గాను అన్ని పార్టీలను ప్రొటెం స్పీకర్ చిన వెంకటఅప్పలనాయుడు ఆహ్వానించారని జగన్ గుర్తు చేశారు. స్పీకర్‌ను ఆయన స్థానంలో కూర్చోపెట్టే విపక్షనేత రాకుండా తనను పిలవలేదని రాద్దాంతం చేస్తున్నారని జగన్ విమర్శించారు.

ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. తనను బంట్రోతు అంటూ చేసిన వ్యాఖ్యలు మీకు ఇంపుగా తనకు అభ్యంతరం లేదన్నారు. తాను చంద్రబాబుకు బంట్రోతు అయితే మీరంతా జగన్ బంట్రోతులా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తామంతా ఎమ్మెల్యేలమో... కాదో తేల్చాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ఈ సమయంలో  కొందరు వైసీపీ సభ్యులు  గతంలో టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నరరూప రాక్షసుడిగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారని  ఆయన గుర్తు చేశారు. బంట్రోతు అంటే సేవకుడు అనే అర్ధం అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

గత ఐదేళ్లలో ఇదే అసెంబ్లీ అప్పటి విపక్షనేత గురించి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు క్షమాపణలు చెబితే తాను కూడ క్షమాపణ చెబుతానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు.రికార్డులను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకొంటానని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. 

ఈ సమయంలో చంద్రబాబునాయుడు మరోసారి మాట్లాడారు. ఈ విషయమై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకొంటారో దానికి కట్టుబడి ఉంటానని  విపక్షనేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. సభను హుందాగా నడిపించేందుకు వీలుగా ఏ నిర్ణయం బాగుంటుందో ఆ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని తాము వివాదం చేయాలని కోరుకోవడం లేదన్నారు.