Asianet News TeluguAsianet News Telugu

కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.. మాజీ మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.

ysrcp mla balineni srinivasa reddy comments on kotamreddy sridhar reddy issue
Author
First Published Jan 31, 2023, 6:44 PM IST

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డితో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి స్థానంలో అక్కడ పార్టీ ఇంచార్జ్‌ను నియమించనున్నట్టుగా చెప్పారు. ఎవరూ ఉన్న లేకపోయినా సీఎం జగన్ చరిష్మాతో నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

రేపటి రోజు శ్రీధర్ రెడ్డి బాధపడే రోజు వస్తుందని అన్నారు.  వైసీపీ నుంచి బయటకు వెళ్లాలని అనుకున్నవారే పార్టీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. అతడు మాట్లాడిన వ్యక్తే రికార్డు చేసి ఆడియోను బయటకు వదిలాడని అన్నారు. టీడీపీలో ఖాళీలు ఉన్నాయని.. టికెట్లు రావని అనుకున్నవారు అక్కడికి పోతారేమోనని విమర్శించారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వస్తానని అంటున్నారని.. కానీ తమ పార్టీలో ఖాళీలు లేవని చెప్పారు.  

ఇక, ఇక, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర సంచనలంగా మారింది. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి.. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి  తెలిసిందే. బహిరంగంగానే ఆయన కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిచిన సీఎం జగన్.. ఆయనతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కోటంరెడ్డి.. సీఎం జగన్‌కు వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. సమస్యలను పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై తానెక్కడా విమర్శలు చేయలేదని చెప్పారు. అధికారుల నుంచి సహకారం లేదనే మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. 


ఈ పరిణామం తర్వాత అంతా సద్దుమణిగిందని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే తాజాగా కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై  ఇంటలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.  తన ఫోన్  ను ట్యాప్  చేస్తున్నారన్నారనీ.. ఈ విషయం తనకు  ముందు  నుంచే  తెలుసని అన్నారు. రహస్యాలు  మాట్లాడుకొనేందుకు  తనకు  వేరే ఫోన్  ఉందన్నారు. తన వద్ద  12 సిమ్ కార్డులున్నాయని చెప్పారు. ఫేస్ టైమర్  , టెలిగ్రాం కాల్స్‌ను  పెగాసెస్  రికార్డు చేయలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  పోలీసులనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన  తనపై  ఎందుకు  నిఘా  పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.  అవసరమైతే  తనపై నిఘా  కోసం  ఐపీఎస్ అధికారిని నియమించుకోవాలని అని  కామెంట్స్ చేశారు. 

తాజాగా.. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేస్తానని కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి చెబుతున్నట్టుగా ఉన్న ఓ ఆడియో వైరల్‌గా మారింది. తన అనుచరులతో  మాట్లాడుతూ కోటంరెడ్డి ఈ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios