ఎన్నికల నిర్వహణ  సాధ్యం కాదని ఎస్ఈసీకి సీఎస్ చెప్పారని గుర్తుచేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వంతో తగాదా పడాలనే దురుద్దేశంతో నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ... చంద్రబాబు తొత్తులాగా వ్యవహరిస్తున్నారని అంబటి ఆరోపించారు. రమేశ్ కుమార్ న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నారని భావించిన వాళ్లకి చాలా స్పష్టంగా అర్ధమైందని ఎద్దేవా చేశారు.

కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైందని, త్వరలో వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారని.. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగమంతా బిజీగా వున్నారని రాంబాబు గుర్తుచేశారు. వ్యాక్సిన్‌ కంటే పంచాయతీ ఎన్నికలు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సంసిద్ధత లేకుండానే ఎస్ఈసీ షెడ్యూల్ ఇచ్చారని రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లు కోవిడ్ వచ్చాక అసలు బయటకొచ్చారా.. హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చేవారని అంబటి సెటైర్లు వేశారు.

Also Read:స్థానిక ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్

చంద్రబాబు చెప్పినందువల్లే ఇదంతా జరుగుతోందని రాంబాబు ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలో చంద్రబాబుకు డిపాజిట్లు వస్తాయో లేదోనని ఆయన భయపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

అప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళితే టీడీపీకి దెబ్బ పడుతుందని ఉద్దేశ్యంతోనే హడావిడిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారని రాంబాబు ఆరోపించారు.

ఎన్నికల విధుల్లో వున్న సిబ్బందికి కరోనా వల్ల జరగరానిది జరిగితే బాధ్యత వహించేది ఎవరని ఆయన ప్రశ్నించారు. తనను చిత్తు చిత్తుగా ఓడించారని ప్రజలపై చంద్రబాబుకు కక్ష వుందని.. అందుకే ఎస్ఈసీలోకి పరకాయ ప్రవేశం చేశారని రాంబాబు ఎద్దేవా చేశారు.