పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేసిన షెడ్యూల్‌ను నిలుపుదల చేసేందుకు ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది. ఇందుకు సంబంధించి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

నేటి నుంచి హైకోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్‌ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అంటోంది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయాలని భావించింది. అయితే నిన్న 1.30 గంటలకు సమయం ముగిసిపోవడంతో అత్యవసర అంశానికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేయాలని, రిజిస్ట్రార్‌ను సంప్రదించింది.

ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు చీఫ్ జస్టిస్‌ను కలిసి.. హౌస్ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసేందుకు సమయం కూడా కోరారు. పిటిషన్ దాఖలు చేసేందుకు రిజిస్ట్రార్ అనుమతించడంతో అక్కడి నుంచి నేరుగా చీఫ్ జస్టిస్‌కు చేరుతుంది.

అనంతరం సీజే దానిని డివిజన్ బెంచ్‌కు లేదంటే సింగిల్ జడ్జి బెంచ్‌కి బదిలీ చేసే అవకాశాలు వున్నాయి. లేని పక్షంలో ప్రధాన న్యాయమూర్తే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఏదైనా సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం వుంది.