వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ పార్టీగా ముద్ర వేసేందుకు కొందరు చాలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ... కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ పద్దెనిమిది మాసాల్లో జగన్ సుపరిపాలన అందించారని రాంబాబు ప్రశంసించారు.

రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగు అయిపోతాననే భయంతోనే చంద్రబాబు మతాలను రెచ్చ గొడుతున్నారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు మత మనిషి అయ్యాడని... ఆయనకు ఇప్పుడు శ్రీరాముడు గుర్తుకొస్తున్నాడని రాంబాబు ఎద్దేవా చేశారు.

రాముడు గుర్తుంటే తన సీట్ వెనుక చంద్రబాబు బుద్దుడి బొమ్మను ఎందుకు పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా జగన్ మత మార్పిడి చేసుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడని ఆయన దుయ్యబట్టారు.

ఆయన హయాంలో నలభై దేవాలయాలను కూల్చి దేవుడి విగ్రహాలను చెత్త లో వేశారని రాంబాబు గుర్తుచేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పాస్టర్‌లకే ప్రాముఖ్యతను ఇస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఆయన ధ్వజమెత్తారు.

అన్ని మతాలతో పాటు ఆ మతానికి తమ ప్రభుత్వం ప్రాముఖ్యతను ఇస్తుందని రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు దైవం, మతం, ప్రజలు అంటే గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.