టీడీపీ నేత నారాలోకేశ్‌పై విరుచుకుపడ్డారు  వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన సవాల్ చేస్తే నాయకులవుతారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిస్తే లీడర్‌లు అవుతారంటూ చురకలు వేశారు.

లోకేశ్ ఎక్కడైనా గెలిచి సవాల్ చేయాలని అంబటి వ్యాఖ్యానించారు. టీడీపీ ఉనికే ప్రమాదంలో పడిందని.. చంద్రబాబు, లోకేశ్‌లు వీధి వీధి తిరుగుతున్నా జనం రావడం లేదని రాంబాబు సెటైర్లు వేశారు.

సీఎం, ఎమ్మెల్యేలపై చంద్రబాబు, లోకేశ్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబును ఇప్పటికే చిత్తూరు జిల్లా ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని... చంద్రబాబు, లోకేశ్‌లను ప్రజలు ఎప్పుడో తరిమికొట్టారని అంబటి వ్యాఖ్యానించారు.

Also Read:పవన్‌ సినిమా కోసం నిబంధనలు మార్చరు: సునీల్ దేవధర్‌కి పేర్ని నాని కౌంటర్

లోకేశ్ ఐరెన్ లెగ్ అని.. ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్ అంటూ ఆయన సెటైర్లు వేశారు. పచ్చ జెండా పట్టుకోవడానికి కార్యకర్తలే లేరని.. బీజేపీ, జనసేన  పాతమిత్రులేనని రాంబాబు వెల్లడించారు.

వెంకన్న సాక్షిగా మోడీ, చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటేయాలని అంబటి నిలదీశారు. వకీల్ సాబ్ సినిమాకు.. ఎన్నికలకు సంబంధం ఏంటనీ అంబటి ప్రశ్నించారు.

ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చారా..? సినిమా ప్రచారానికి వచ్చారా అంటూ రాంబాబు చురకలు వేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం తథ్యమని అంబటి ధీమా వ్యక్తం చేశారు.