Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ సినిమా కోసం నిబంధనలు మార్చరు: సునీల్ దేవధర్‌కి పేర్ని నాని కౌంటర్

పవన్ సినిమా కోసం నిబంధనలను మార్చరని  తెలుసుకోవాలని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బీజేపీ నేతలకు హితవు పలికారు. 

Ap minister perni nani reacts on Bjp leader sunil Deodhar  comments lns
Author
Tirupati, First Published Apr 9, 2021, 4:40 PM IST

తిరుపతి: పవన్ సినిమా కోసం నిబంధనలను మార్చరని  తెలుసుకోవాలని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బీజేపీ నేతలకు హితవు పలికారు. శుక్రవారంనాడు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.బీజేపీ నేత సునీల్ దేవధర్ సినిమా గురించి మాట్లాడడమేమిటీ అని ఆయన ప్రశ్నించారు.

ఎవరు ఎవర్ని దోచుకోవడానికి అనుమతివ్వాలని ఆయన కోరారు. బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో మీకు తెలుసా అని ఆయన సునీల్ ను ప్రశ్నించారు.  సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారంగా నాలుగు షోలకే అనుమతి ఉందని ఆయన వివరించారు. సినిమా టికెట్ ధర పెంచితే పేద, మధ్య తరగతి ప్రజలపై  భారం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ కారణంగానే బెనిఫిట్ షోలు రద్దు చేశామన్నారు.

హీరోలు ఏది చెబితే జనం అదే నమ్ముతారా అని ఆయన అడిగారు. పవన్ సినిమా కోసం నిబంధనలను మార్చరని  తెలుసుకోవాలని ఆయన బీజేపీ నేతలకు హితవు పలికారు.తిరుపతిలో బీజేపీ నేతలు ఊహల్లో విహరిస్తున్నారని చెప్పారు. వకీల్ సాబ్ హిట్ కు తిరుపతిలో బీజేపీ గెలుపునకు సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు పెట్టిందని పవన్ గతంలో చేసిన విమర్శలను ఆయన గుర్తు చేశారు.చేయిచాచి సాయం అడిగితే ఉమ్ము వేశారని ఆరోపించారు. 2019 ఎన్నికల వరకు మోడీని, అమిత్ షాతో పాటు బీజేపీ నేతలను  దూషించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ మొదటి ద్రోహి అయితే, రెండో ద్రోహి బీజేపీ అని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడేమో బీజేపీకే  ఓటు వేయాలని పవన్ కళ్యాణ్  కోరడాన్ని ఆయన ప్రస్తావించారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు  పవన్ కళ్యాణ్ ను విమర్శించిన విషయం ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు.బీజేపీ, పవన్ మధ్య సంబంధాలను వ్యాపార థృక్ఫథంతో చూస్తున్నారని ఆయన చెప్పారు.ఓట్ల కోసం చంద్రబాబు సందుల్లో తిరిగే పరిస్థితికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios