అమరావతి: న్యాయ మూర్తుల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎవడో పిచ్చోడితో వార్త రాయిస్తారు, మళ్ళీ వాళ్లే చర్చ పెడతారన్నారు.
న్యాయ వ్యవస్థకు తమకు మధ్య దూరం పెంచాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.అవస్తావాలు రాసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానికి చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ లేఖలో  మోడీని పొగుడుతూ చంద్రబాబు రాసిన మాటలు చూసి ఆశ్చర్యం వేసిందన్నారు. భార్యను చూడలేని మోడీ భారతదేశాన్ని ఏమి పాలిస్తాడని గతంలో బాబు చేసిన విమర్శలను అంబటి గుర్తు చేశారు. మోడీకి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్ధులను కూడగొట్టారన్నారు. 

అందితే జుట్టు అందక పోతే కాళ్ళు అనేది చంద్రబాబు నైజంగా కన్పిస్తోందన్నారు. సీబీఐ, ఈడి రాష్ట్రానికి రావడానికి వీల్లేదని చంద్రబాబు చెప్పారని ఇప్పుడేమో ప్రతి దానికి సీబీఐ విచారణ కోరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.సీబీఐ ఈడి మీద పోయిన నమ్మకం చంద్రబాబుకు ఎప్పుడు కలిగిందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై ఒక ఆదారమైన చంద్రబాబు చూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు పది హత్యలు, లోకేష్ పది రేపులు చేశారని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఎల్లో మీడియాలో ఫోన్ ట్యాపింగ్ అంటూ వార్తలు రాయిస్తారు. అదే ఎల్లో మీడియాలో టీడీపీ నేతలు మాట్లాడుతారన్నారు.విచారణ జరపాలని కోర్టులో టీడీపీ నేతలు పిటిషన్ వెయిస్తారని ఆయన చెప్పారు.

సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాద సంస్థల ఫోన్ లు మాత్రమే ట్యాపింగ్ చేస్తారని ఆయన ఆరోపించారు. టీడీపీ నక్క జిత్తులను ప్రజలు నమ్మరన్నారు.

రమేష్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో గగ్గోలు పెట్టిన టీడీపీ  రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన వారు అయితే ఒక విధంగా వేరే వారు అయితే మరో విధంగా చంద్రబాబు వ్యవహరిస్తారు..