టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబు ప్రస్తుతం విచిత్రమైన మానసిక పరిస్థితిలో వున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

నాలుగు నెలల పాటు పదవిలో లేకపోడంతో పాటు రాజకీయ సహచరులు తనను వదిలి వేరేపార్టీలో చేరిపోతుండటంతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. జగన్‌పై మోపబడిన కేసుల్లో ఆయన నేరస్తుడిగా రుజువుకాలేదని.. కానీ పదే పదే నేరస్తుడు.. నేరస్తుడు అనడం సరికాదని రాంబాబు హితవు పలికారు.

వైఎస్ కానీ, జగన్ కానీ ఏనాడైనా పంచాయతీలు చేశారా అని ప్రశ్నించారు. ఆదినారాయణ రెడ్డి-రామసుబ్బారెడ్డి, గంటా - అయ్యన్నపాత్రుడిల మధ్య పంచాయతీ చేసింది ఎవరని రాంబాబు నిలదీశారు.

పంచాయతీలతోనే చంద్రబాబు రాజకీయంగా పైకొచ్చారని.. ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి పంచాయతీ చేసి నాడు ఎన్టీఆర్‌ను గద్దె దించారని రాంబాబు గుర్తు చేశారు. పదే పదే పులివెందుల పంచాయితీ అని చెప్పి పులివెందుల గడ్డను అవమానిస్తున్నారని.. అది ఇద్దరు ముఖ్యమంత్రులను రాష్ట్రానికి ఇచ్చిన ప్రాంతమన్నారు.