గత కొన్ని రోజులుగా వైసీపీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ఇవాళ్టీతో ముగియనుంది. ఆదివారం అనంతపురానికి చేరుకున్న మంత్రులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీకి చెందిన (ysrcp ministers bus yatra) మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర (samajika nyaya bhari) అనంతపురానికి (anantapur) చేరుకుంది. ఇవాళ్టీతో యాత్ర ముగుస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ , మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని మంత్రి నారాయణ స్వామి అన్నారు. టీడీపీది మహానాడు కాదని.. వెన్నుపోటు నాడు, దగా నాడు అంటూ వ్యాఖ్యానించారు. నవరత్నాల పథకంతో పేదలకు ఆర్ధిక భరోసా కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. టీడీపీ జరిపింది నయవంచక మహానాడు అని.. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కలేనని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా వున్నారని.. సీఎం జగన్‌ది రామరాజ్యమని నారాయణ స్వామి తెలిపారు.
Also Read: మహానాడు కాదది బూతు నాడు... చంద్రబాబు పక్కనంతా జోకర్లు, బ్రోకర్లే: మంత్రి అంజాద్ బాషా విమర్శలు
మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. చరిత్రలో లేని విధంగా బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని ఆమె ప్రశంసించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జగన్ పాలిస్తున్నారని ఉషాశ్రీ చరణ్ అన్నారు. జగన్ పాలనలోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగిందని.. గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మంత్రి ఎద్దేవా చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయన్నారు. జగన్ పాలనలో కులాలు, పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి చెప్పారు. బీసీలను ఓటు బ్యాంక్‌గానే చంద్రబాబు చూశారని..
మంత్రి గుమ్మనూరి జయరాం మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. కేబినెట్‌లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీలకు అవకాశం కల్పించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మహిళలకు సీఎం జగన్ అండగా వున్నారని.. కులమతాలకు అతీతంగా జగన్ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని జయరాం పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలకే దోచిపెట్టారని.. మనమంతా కలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని జయరాం పిలుపునిచ్చారు.
