అనంతపురం: అనంతపురం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తోంది. మెుదటి రౌండ్ పూర్తయ్యే సరికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. 

ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం, శింగనమల, రాయదుర్గం, రాప్తాడు, పుట్టపర్తి, కదిరి, పెనుకొండలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తోంది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ కేవలం తంబళపల్లి నియోజకవర్గంలో ఆధిక్యత కనబరుస్తోంది. 

అలాగే హిందూపురం నియోజకవర్గంలో సినీనటుడు బాలకృష్ణ సైతం ఆధిక్యతలో ఉన్నారు. మెుత్తం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ తంబల్లపల్లి, హిందూపూర్ మినహా 12 చోట్ల వైసిపి ఆధిక్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో వైసీపీ ఆధిక్యత కనబరుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.