అమరావతి: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ పదవుల కోసం అధికార వైసీపీలో నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని జగన్ కొందరు నేతలకు హామీ ఇచ్చారు.  దీంతో మరోసారి నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఈ నెల 18వ తేదీన విడుదల చేసింది. 

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151 మంది సభ్యుల బలం ఉంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ను మినహాయిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం 150 మంది. ఈ సంఖ్య బలం ఆధారంగా వైసీపీకి ఆరు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి.

ఏపీ శాసమండలిలో ఇప్పటికే టీడీపీదే ఆధిపత్యం కొనసాగుతుంది. టీడీపీకి 26 మంది, వైసీపీకి 8 మంది సభ్యులున్నారు. బీజేపీకి ఇద్దరు, పీడీఎఫ్ కు ఐదుగురు సభ్యులున్నారు. ఈ ఆరు స్థానాలను కైవసం చేసుకొంటే వైసీపీ బలం మండలిలో 14కి చేరుకొంటుంది. ఏపీ శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58.

శాసనమండలిలో టీడీపీ అధిపత్యాన్ని తగ్గించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొందరు టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ గాలం వేసింది. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీని వీడి వైసీపీలో జంప్ చేశారు.

తొమ్మిది మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని వైసీపీ నాయకత్వం హామీలు ఇచ్చింది. ప్రస్తుతం ఆరుగురికి మాత్రమే పదవులు దక్కనున్నాయి. ఈ పదవులు దక్కేది ఎవరికో అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్‌ను ఆఖరి నిమిషంలో లేళ్ల అప్పిరెడ్డికి బదులు ఏసురత్నానికి కేటాయించారు. అనివార్య కారణాల వల్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేకపోతున్నానని ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని జగన్‌ ప్రకటించారు. 

2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మర్రి రాజశేఖర్‌ పోటీ చేస్తారని వైసీపీ నేతలు, జగన్‌ చెబుతూ వచ్చారు. కానీ టీడీపీ నంచి వచ్చిన విడదల రజనికి తుది నిమిషంలో టికెట్‌ను ఇచ్చారు. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికలకు ముందు షేక్‌ ముజుబుల్‌  రెహమాన్‌ అలియాస్‌ పెద్దబాబుకు ఎమ్మెల్సీ స్థానం కట్టబెడతానని జగన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆ హామీ నెరవేరలేదు. 

అదే జిల్లా భీమవరానికి చెందిన మోషేన్‌రాజుకు ఎమ్మెల్సీ ఇస్తానని ఇచ్చిన మాట కూడా నెరవేర్చలేదు. ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తూర్పు గోదావరి జిల్లా నేత తోట త్రిమూర్తులుకు కూడా ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ బహిరంగంగానే వెల్లడించారు. అమలాపురం నేత కుడిపూడి చిట్టబ్బాయ్‌కు కూడా ఎమ్మెల్సీ కట్టబెడతానని హామీ ఇచ్చారు.

కాకినాడ మాజీ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణికి ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇస్తానని 2019 ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు ఆకస్మిక మరణంతో ఆయన కుమారుడు చక్రవర్తికి ఆ టికెట్‌ బదులు ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు.

 ఇప్పుడా మాటను ఆయన నిలబెట్టుకుంటారో లేదో చూడాలని వైసీపీ నేతలు అంటున్నారు. కాగా.. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తరఫున అభ్యర్థులను నిలుపరాదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు బరిలో నిలచిన కల్పలతా రెడ్డి, రామారావులకు మద్దతిస్తారో లేదోనన్న ఆసక్తి ఆ పార్టీలో నెలకొంది.