రాజధానికి పర్చూరు పంచాయితీ: ఆయన వద్దు దగ్గుబాటే ముద్దంటున్న వైసీపీ నేతలు
పర్చూరు ఇంఛార్జ్ గా నియమిస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు లేదా గొట్టిపాటి భరత్ లలో ఎవరో ఒకరికి ఇవ్వాలని సూచించారు. రావి రామనాథంబాబుకు ఇస్తే పార్టీ ఇబ్బందులకు గురవుతుందని తేల్చి చెప్పారు.
తాడేపల్లి: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం పంచాయితీ రాజధాని అమరావతికి చేరుకుంది. ఇప్పటి వరకు జిల్లా ధాటని దగ్గుబాటి అంశం కాస్త ఇప్పుడు రాజధాని వరకు వెళ్లింది. దగ్గుబాటే ముద్దు రామనాథం వద్దు అంటూ వైసీపీ నేతలు రాజధాని వేదికగా బలప్రదర్శనకు దిగారు.
గత కొద్దిరోజులుగా పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జ్ అంశం హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉండాలనుకుంటే ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా పార్టీలోకి తీసుకురావాలని కండీషన్ పెట్టారు సీఎం జగన్.
ఉంటే భార్యభర్తలిద్దరూ ఒకే పార్టీలో ఉండాలని కరాఖండిగా తేల్చి చెప్పేశారు. దాంతో ఏం చేయాలో తోచక దగ్గుబాటి కుటుంబం తర్జన భర్జన పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో సోమవారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేశ్ చెంచురాంలు పార్టీకీ రాజీనామా చేశారు.
ఇకపోతే పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న రాద్ధాంతాన్ని సరిదిద్దాలంటూ ఆ బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైయస్ జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు సీఎం జగన్.
దాంతో పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వైవీ సుబ్బారెడ్డి ఇంటికి చేరుకున్నారు. పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు రావి రామనాథం బాబుకి ఇవ్వొద్దని హెచ్చరించారు.
పర్చూరు ఇంఛార్జ్ గా నియమిస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు లేదా గొట్టిపాటి భరత్ లలో ఎవరో ఒకరికి ఇవ్వాలని సూచించారు. రావి రామనాథంబాబుకు ఇస్తే పార్టీ ఇబ్బందులకు గురవుతుందని తేల్చి చెప్పారు. గతంలో పార్టీ ఓడిపోవడానికి కారణమైన రామనాథంబాబును వైసీపీ ఇంఛార్జ్ గా ఎలా నియమిస్తారంటూ మండిపడ్డారు.
అయితే పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జ్ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఇంఛార్జ్ ఎవరో అన్నది నిర్ణయిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
పొమ్మనలేక పొగబెట్టారా.?: వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై, పురంధేశ్వరికి అడ్డుకాకూడదని
వైసీపీకి దగ్గుబాటి తనయుడు రాజీనామా: పురంధేశ్వరి కోసమే
పిలిచి దగ్గుబాటిని అవమానిస్తారా: జగన్ పై భగ్గు, కార్యకర్త ఆత్మాహుతి యత్నం