త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఈ క్రమంలో గెలవడానికి ఉన్న ఏ ఒక్క మార్గాన్ని వదిలిపెట్టకూడదని అధికార, ప్రతిపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.

ఈ క్రమంలో ఎన్నికల సమయంలో అత్యంత కీలకంగా వ్యవహారించే పోలీసులను సైతం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా వైసీపీ నేత ఒకరు పోలీసులను ఆకర్షించడానికి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.

మైలవరం నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కృష్ణప్రసాద్ తన అనుచరుడు మాగంటి వెంకట రామారావు ద్వారా జీ.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం పోలీస్ స్టేషన్‌కు నగదును పంపారని కథనాలు వచ్చాయి.

డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోని ఎస్ఐ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినట్లు ఆ కథనాల సారాంశం. అయితే అధికార పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే తమ నేతలను ఇరికిస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు.

మంత్రి దేవినేని ఉమ ఒత్తిళ్ల కారణంగానే ఎస్సై తమపై తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమ, ఆయన అనుచరుల కలప స్మగ్లింగ్‌పై ఫిర్యాదు చేసినందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

అయితే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు మాగంటి వెంకట రామారావు జీ.కొండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు విడుదల చేయడం గమనార్హం. దీని ఆధారంగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.