దుట్టాతో యార్లగడ్డ భేటీ: గన్నవరం వైసీపీలో ఏం జరుగుతుంది ?
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యార్లగడ్డ వెంకటరావు ఇవాళ దుట్టా రామచంద్రారావుతో ఇవాళ భేటీ అయ్యారు.
గన్నవరం: గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకటరావులు సోమవారంనాడు భేటీ అయ్యారు. ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో దుట్టా రామచంద్రారావుతో యార్లగడ్డ వెంకటరావు రెండు గంటలకు పైగా భేటీ అయ్యారు.
2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్ రావు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ పోటీ చేసి యార్లగడ్డ వెంకట్ రావు పై విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. దీంతో యార్లగడ్డ వెంకట్ రావు, దుట్టా రామచంద్రారావులు ఒక్కటయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడ గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వల్లభనేని వంశీకే వైఎస్ఆర్‌సీపీ టికెట్టు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డ వెంకట్ రావు, దుట్టా రామచంద్రారావులు ఒక్కటయ్యారు.
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తన వర్గీయులపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు వేధింపులకు పాల్పడుతున్నారని గతంలోనే యార్లగడ్డ వెంకట్ రావు ఆరోపణలు చేశారు. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్ రావు, దుట్టా రామచంద్రరావు మధ్య సమన్వయం కోసం వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ప్రయత్నాలు చేసింది. అయినా కూడ ఈ నేతల మధ్య గ్యాప్ తగ్గలేదు.
also read:దుట్టాతో యార్లగడ్డ భేటీ: గన్నవరం వైసీపీలో ఏం జరుగుతుంది ?
ఈ ఏడాది జనవరి 15న దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్ రావులు భేటీ అయ్యారు. తాజాగా ఇవాళ మరోసారి ఈ ఇద్దరు నేతలు భేటీ కావడం చర్చకు దారి తీసింది. గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో ఎన్ఆర్‌ఐని బరిలోకి దింపుతామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అయితే యార్లగడ్డ వెంకట్ రావు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాన్ని వెంకట్ రావు వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. యార్లగడ్డ వెంకట్ రావుపై దుష్ట్ప్రచారం చేయడం కోసం కొందరు గిట్టనివాళ్లు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు.