తనకు చెల్లించాల్సిన బాకీని చెల్లించకపోతో నీ కుమార్తెను దారుణంగా చంపేస్తాంటూ గుంటూరుకు చెందిన దంపతులకు కొందరు వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండటంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ముక్తేశ్వరానికి చెందిన రావూరి వెంకటేశ్వర్లు భార్య అనురాధ తమ పాప అభినయశ్రీతో కలిసి నివసిస్తున్నారు. అపరాల వ్యాపారం చేస్తూ తన గ్రామానికే చెందిన వైసీపీ ఐటీ విభాగంలో పనిచేస్తున్న మహేంద్ర‌రెడ్డి నుంచి వ్యాపారం కోసం రూ.15 లక్షలు రూ. 4 వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు.

నెలకు రూ. 60 వేలు వడ్డీ చెల్లిస్తూ... అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ. 28 లక్షల వరకు చెల్లించాడు. అయితే అప్పు తీసుకునే సమయంలో మూడు చెక్కులు, 19 ప్రామీసరి నోట్లను వెంకటేశ్వర్లు నుంచి మహేంద్రరెడ్డి రాయించుకున్నాడు.

అయితే ఇక తాను సొమ్ము చెల్లించుకోలేనని చెప్పడంతో రెండు చెక్కులు రూ. 5 లక్షలకు వేరే వారి పేరుతో కోర్టులో వేశాడు.. వ్యాపారంలో నష్టం రావడంతో వెంకటేశ్వర్లు తన మకాంను గుంటూరుకు మార్చాడు.

కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం మహేంద్రరెడ్డి తన దగ్గర పనిచేస్తున్న శంకర్ రెడ్డి, చెన్నూరి చిన సుబ్బారావు, ఇప్పల నర్సిరెడ్డితో కలిసి కార్లలో వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చి దాడి చేశాడు.

మరోసారి వెంకటేశ్వర్లకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. సీఎం గన్‌మెన్‌గా పరిచయం చేసుకున్నాడు. మహేంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బు  మొత్తం వడ్డీతో చెల్లించాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు.

వెంకటేశ్వర్లు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు... సుంకర రామాంజనేయులు అనే వ్యక్తి ఫోన్ చేసి... ఈ వ్యవహారం పీఏ పర్సనల్ అని తక్షణం బాకీ తీర్చాలన్నాడు. లేదంటే గుంటూరులోని వైసీపీ నేత కార్యాలయానికి రావాలని హెచ్చరించాడు.

అక్కడితో ఆగకుండా విజయవాడ చిన్నారి శ్రీవైష్ణవిని చంపిన విధంగానే నీ కూతుర్ని కూడా కిడ్నాప్ చేసి బాయిలర్‌లో వేసి దారుణంగా చంపేస్తామని హెచ్చరించాడు. గతంలో తాము వూళ్లో మర్డర్ చేసిన విషయం తెలుసుకదా జాగ్రత్త అంటూ హెచ్చరించాడు.

దీంతో వారి బెదిరింపులకు భయపడిపోయిన వెంకటేశ్వర్లు, తన భార్య అనురాధ, కుమార్తె అభినయశ్రీతో కలిసి సోమవారం గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కాగా.. మహేంద్రరెడ్డి గతంలో ముక్తేశ్వరంలో జరిగిన హత్య కేసులో నిందితుడు.. ఇదే క్రమంలో నర్సిరెడ్డి అనే మరో వ్యక్తి సైతం మహేంద్రరెడ్డి తనను బెదిరిస్తున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

గ్రామంలో తనకు ఉన్న ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలను మహేంద్రరెడ్డి అనుచరులే దౌర్జన్యంగా  సాగు చేసుకుంటున్నారని... ఇప్పుడు ఆ పొలాన్ని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో వాపోయాడు.