విజయవాడ : దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమా అద్భుతంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

శుక్రవారం విజయవాడలో యువరాజ్ థియేటర్ లో మాజీఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి సినిమా చూసిన ఆయన సినిమా చాలా బాగుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాటించిన నైతికల విలువలు, విధేయతలను తెరపై అద్భుతంగా చిత్రీకరించారని వ్యాఖ్యానించారు. 

పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు చక్కగా చూపించారని చెప్పుకొచ్చారు. ఈసినిమాకి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర విశేషాలు ప్రత్యేక హైలెట్ అని ప్రశంసించారు. తెలుగు ప్రజలంతా తప్పక చూడాల్సిన సినిమా యాత్ర అంటూ చెప్పుకొచ్చారు. 

ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్న చంద్రబాబుకు ఈ సినిమా చూపించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. సినిమా చూసైనా చంద్రబాబులో మార్పువస్తుందేమోనని చెప్పుకొచ్చారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కారం కోసం అనుదినం పనిచేసిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్గంలో తాము ప్రయాణిస్తామని మాజీఎమ్మెల్యేలు తెలిపారు.