విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టిదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి ఉషాకిరణ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 

పసుపులేటి ఉషాకిరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా,  ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ గా కూడా పనిచేశారు. వైసీపీలో క్రమశిక్షణ కలిగిన నాయకురాలిగా గుర్తింపు కూడా ఉంది. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంపై ఆమె ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామని భావించినప్పటికీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె కాస్త నిరాశకు లోనయ్యారు. అంతేకాదు ఇటీవలే ఆమెను రాష్ట్రకార్యదర్శిగా కూడా నియమించారు. 

ఈ నేపథ్యంలో తనకు టిక్కెట్ దక్కేఅవకాశం లేదని భావించిన ఆమె జనసేన వైపు చూడటం మెుదలుపెట్టారు. అలాగే వైసీపీలో కాపు సామాజిక వర్గానికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉషాకిరణ్ శుక్రవారం సాయంత్రం వైసీపీకి రాజీనామా చేశారు. శనివారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. 

ఉషాకిరణ్ రాకతో విశాఖపట్నంలో జనసేన పార్టీ బరింత బలోపేతం అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉషాకిరణ్ కు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు.