ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముందు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సెలవుల్లోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆరు రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తవ్వాల్సి వుందని సజ్జల పేర్కొన్నారు.

సెలవులు వాయిదా వేసుకుని ఎన్నికలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ .. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

ఎన్నికలు అత్యంత నిష్పక్షపాతంగా జరిగాయన్నారు సజ్జల. పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన స్థానాల కంటే అధిక స్థానాలను కల్పించిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. ఈ నెలాఖరున రిటైర్ అవుతున్న ఆయన ఎన్నికలు సక్రమంగా నిర్వహించినట్లుగా వుంటుందని ఎస్ఈసీకి సజ్జల హితవు పలికారు. 

కాగా, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీన్ రివర్స్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి పట్టుబట్టి ఎట్టకేలకు గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించారు. అయితే, సగంలో ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి ఆయన సముఖంగా లేనట్లు కనిపిస్తున్నారు. 

కరోనా నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్యలో వాయిదా వేశారు. అయితే, వాటిని నిర్వహించకుండానే పదవీ విరమణ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.

ఆయన సెలవుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగుస్తోంది. అయితే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని వైఎస్ జగన్ పట్టుబడుతున్నారు.

కరోనాపై, వాక్సినేషన్ మీద ఆయన బుధవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియ వాక్సినేషన్ కు ఆటంకంగా మారిందని ఆయన అన్నారు.

సాధ్యమైనంత త్వరగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఆయన అన్నారు. దేశంలో మరోసారి కరోనా వ్యాప్తి చెందుతోందని, వాక్సినేషన్ చేయడానికి వీలుగా ఎన్నికలను వెంటనే ముగించాలని ఆయన అంటున్నారు.