వరద బాధితులకు సాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై కౌంటరిచ్చారు వైసీపీ నేత , ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబులా తాము హడావుడి చేయమని, వరద సాయం నేరుగా బాధితులకు అందుతోందన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. కాగితాలు తీసుకునేందుకే అప్పట్లో జన్మభూమి సభలు పెట్టారని ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలన రాష్ట్ర ప్రజలకు ఓ పీడకల అని సజ్జల ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో అర్హత వున్నవారందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పథకాలు అందిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. 

అవినీతికి అవకాశం లేకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని సజ్జల వెల్లడించారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నామని.. పటిష్టమైన వ్యవస్థ వల్లే ప్రజా సమస్యలకు పరిష్కారమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమంలో సీఎం జగన్ కొత్త శకానికి నాంది పలికారని.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లేలా పాలన చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైందని సజ్జల తెలిపారు. రాష్ట్రంలో కోటి 46 లక్షల కుటుంబాలను కలిశామని.. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ ఏపీలో అమలవుతోందని రామకృష్ణారెడ్డి అన్నారు. 

వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందుతోందని.. చంద్రబాబులా మా ప్రభుత్వం హడావుడి చేయదని ఆయన చురకలంటించారు. బాధితులకు నేరుగా సాయం అందిస్తున్నామని సజ్జల తెలిపారు. చంద్రబాబులా మా ప్రభుత్వం ఎవరికీ దోచిపెట్టడం లేదని.. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తున్నామన్నారు. పెత్తందార్ల కోసమే చంద్రబాబు ఆరాటమని.. పేదల పక్షాన మా ప్రభుత్వం పోరాడుతుందని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.