కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌ని కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు ఫాలో కావడంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి సీరియస్‌గా వుందనే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేదని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసు, వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ తదితర అంశాలపై స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ రోజు సీబీఐ విచారణకు ఆయన హాజరుకాకపోవడంపై కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ప్రచారం చేస్తున్నాయని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి సీరియస్‌గా వుందనే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేదని.. గతంలో సీబీఐ విచారణకు పిలిచిన ప్రతిసారి అవినాష్ హాజరయ్యారని ఆయన గుర్తుచేశారు.
తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి అవినాష్ ముందే సమాచారం ఇచ్చివుంటారని సజ్జల అభిప్రాయపడ్డారు. సీబీఐ పిలిచాక ఇవాళ కాకపోయినా రేపైనా వెళ్లకతప్పదన్నారు. అయితే అవినాష్ రెడ్డిని పచ్చ మీడియా వెంటాడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తుడు తప్పించుకుంటున్నాడు అన్నట్లుగా ఆయన కాన్వాయ్‌ను ఫాలో అయ్యారని.. అయితే ఇది సరికాదని సజ్జల స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.
ALso Read: ఆర్ 5 జోన్‌లో మోడరన్ టౌన్‌లు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
తల్లికి అనారోగ్యం వుందనే సాకుతో విచారణకు డుమ్మా కొట్టే వ్యక్తి అవినాష్ కాదని.. అసలు వైఎస్ ఫ్యామిలీయే అలాంటిది కాదని ఆయన స్పష్టం చేశారు. వివేకాను నరికాను అని చెబుతున్న వ్యక్తి ఈరోజు కార్లలో తిరుగుతూ, ప్రెస్‌మీట్లు పెడుతున్నాడని సజ్జల దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబం పాత్ర వుందని చిన్న ఆధారం దొరికినా ఆనాడు సీఎంగా వున్న చంద్రబాబు వదిలిపెట్టేవారా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అసలు సీబీఐ గట్టిగా తలచుకుంటే తప్పించుకోగలరా అని ఆయన నిలదీశారు.
