పత్రిక వ్యవస్థలపై నమ్మకం పోయేలా రాతలు రాశారంటూ మండిపడ్డారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన న్యాయస్థానాలు కూడా దీనిని పట్టించుకోవాలని కోరారు.

హైకోర్టు ను మూసేయమనండి... అంటూ రాసిన రాతలు ఆశ్చర్య పరిచాయని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రతి వ్యవస్థ...తాము ఆత్మ నిగ్రహం పాటించడంతో పాటు పక్క వ్యవస్థలను గౌరవించాలని లేదంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ వ్యవస్థ బాగుందని మేము అందడం లేదు...అలాగని మిగతా వ్యవస్థలు బాగున్నాయని తాము చెప్పలేమని అన్నారు. న్యాయస్థానాలు ఇలాంటి కామెంట్స్ చేయాలనుకుంటే...రికార్డ్ చేసే తీర్పులో భాగం చేయాలని రామకృష్ణారెడ్డి కోరారు.

అన్ని సమస్యలను తీర్చాల్సినది న్యాయవ్యవస్థేనని అక్కడ నుంచి ఒక కామెంట్ వస్తే ఏమి చేయాలని ఆయన ప్రశ్నించారు. చిన్న సంఘటనలను రాష్ట్రం మొత్తం ఆపాదించడం బాధాకరమని, పోలీస్ వ్యవస్థ గతం నుంచి ప్రజల వ్యవస్థగా మారుతోందని సజ్జల చెప్పారు.

జగన్ గారు వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని, అదే సమయంలో ఎక్కడయినా సంఘటన జరిగితే క్షమించడం లేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులపై కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.

ఇలాంటి సమయంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా...? దాన్ని నియంత్రిస్తున్న ప్రభుత్వం ఉందా...అంటూ చేస్తున్న కామెంట్స్ బాధ కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క లక్ష కేసుల్లో ఎక్కడో చిన్న తప్పు జరిగితే రాజ్యాంగం దెబ్బతిన్నది అంటూ వ్యాఖ్యలు బాధాకరమన్నారు.

సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నా పక్కవారి స్వేచ్ఛను దెబ్బతీయలేమని సజ్జల చెప్పారు. దానికి సంబంధించిన చట్టాలు కూడా పెద్దగా లేవని, కట్టడి చేయాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి బాధితుల్లో అగ్ర శ్రేణిలో ఉన్నది తమ పార్టీ, తమ నాయకుడేనన్నారు.

ఎవరన్నా కామెంట్ చేసినా వైఎస్ జగన్ వదిలేయండి అంటున్నారని సజ్జల గుర్తుచేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం ఎప్పటికైనా మంచిదేనని, ఇలాంటి విషయాల్లోనూ నేరుగా వ్యవస్థ పై కామెంట్ చేయడం ఇబ్బందికరమని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఎంపై, వ్యవస్థ పై చేస్తున్న కామెంట్స్ కూడా రాజ్యాంగ ఉల్లంఘనే కదా అన్నారు.

నిన్న అత్యున్నత న్యాయస్థానం అమరావతి కుంభకోణం పై చేసిన కామెంట్స్ పై కూడా అంతే సీరియస్ గా వేయాలి కదా అని సజ్జల అభిప్రాయపడ్డారు. మీడియా ద్వారా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నమని గౌరవ న్యాయమూర్తులు, న్యాయస్థానాలు గుర్తించాలని ఆయన కోరారు.