రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలపై చంద్రబాబు వ్యవహారం అంతులేని కథగా ఉందన్నారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు దురాలోచనల అన్నిటికీ రైతులు బలవుతున్నారని సజ్జల ఆరోపించారు.

రాజధాని కోసం రైతుల నుంచి వసూలు చేసిన చందాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణ చేసి రైతులను చంద్రబాబు మోసం చేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

రైతులను మోసం చేశారు కాబట్టే చంద్రబాబు ఓటమి చెందారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్ ఇబ్బంది పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:సీఎన్జీకీ, ఎల్పీజీకీ తేడా తెలియడం లేదా: లోకేశ్‌పై సజ్జల సెటైర్లు

మతాన్ని అడ్డం పెట్టుకొని  చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. సున్నితమైన అంశాన్ని రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు ఆయన దుయ్యబట్టారు.

గ్రామాల్లో జరిగిన ఘటనలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై బురద చల్లటమే ఎజెండాగా చంద్రబాబు పెట్టుకున్నారని సజ్జల విమర్శించారు.

మీడియా మ్యానేజిమెంట్ చేయడంలో  చంద్రబాబు దిట్ట అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షనేత రాజకీయాలు చేయడానికి అస్సలు పనికిరారని సజ్జల వ్యాఖ్యానించారు.

అంతర్వేది ఘటనపై మాత్రమే సీబీఐ విచారణకు ఇచ్చామని.. అలాగే సాంప్రదాయాన్ని, మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించిన అన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.