అనంతపురం:  అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబునాయుడు ఎయిర్‌పోర్టులో డ్రామా నాటకాలు ఆడారని ఏపీ ప్రభుత్వ రాష్ట్ర సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు.

సోమవారం నాడు ఆయన అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో చంద్రబాబు డ్రామా సృష్టించారన్నారు.

టీడీపీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. చంద్రబాబు తన పార్టీ పరిస్థితిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని  ఆయన హితవు పలికారు. ఎస్‌ఈసీ అనుమతి లేకుండా తిరుపతికి వచ్చి బాబు నానాయాగీ చేస్తున్నారని  ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని మండిపడ్డారు.

చిత్తూరు జిల్లా ఎస్పీని, కలెక్టర్ ను కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబునాయుడు రేణిగుంట ఎయిర్ పోర్టులోనే నిరసనకు దిగిన విషయం తెలిసిందే.