హైకోర్టు విభజన విషయంలో న్యాయ వ్యవస్థపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానకరంగా మాట్లాడుతున్నాడంటూ వైఎస్సార్ సిపి అధికార ప్రతినిది సి. రామచంద్రయ్య ధ్వజమెత్తారు. ఉమ్మడి హైకోర్టు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి సీఎం చంద్రబాబుపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో భాగంగానే ఏపికి ప్రత్యేక హైకోర్టును వచ్చిందని...దీనికి చంద్రబాబుకు వచ్చిన బాధేంటో అర్థం కావడం లేదని రామచంద్రయ్య అన్నారు. దీని  వల్ల ఏదో కుట్ర జరుగుతుందని చంద్రబాబు అంటున్నారని, ఈ విభజనలో కాదు చంద్రబాబు ఆలోచనల్లోనే కుట్ర దాగుందని ఆయన పేర్కొన్నారు.  

హుటాహుటిన సెక్రటేరియట్ ను హైదరాబాద్ నుండి అమరావతికి మార్చగా లేనిది...హైకోర్టును మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అయినా చంద్రబాబే గతంలో డిసెంబర్ 15  వరకు నూతన హైకోర్టు భవనాన్ని నిర్మిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇప్పుడేమో ఇలా మాటమారుస్తున్నారంటూ రామచంద్రయ్య తెలిపారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటు వల్ల జగన్ కేసు మొదటికి వస్తుందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు. ఇలా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తారనడం దారుణమన్నారు. 

తెలుగు ప్రజలు, ప్రభుత్వాల కోరిక మేరకే హైకోర్టు విభజన జరిగిందని తెలిపారు. మనం డిమాండ్ చేస్తున్న దాన్నే వారు ఇచ్చారని...దీనిపై చంద్రబాబు రాద్దాంతం చేయడం ఆపాలని రామచంద్రయ్య సూచించారు.