అధికార అండతో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టిడిపి కుట్రలకు తెరతీస్తోందని వైఎస్సార్‌సిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా ఏకంగా ప్రతిపక్ష నాయకుడి సొంత బాబాయ్ ని అత్యంత క్రూరంగా హతమార్చారని తెలిపారు. ఇలా రాజకీయ హత్యకు పాల్పడిన  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్‌సిపి నాయకులు మల్లాది విష్ణు విమర్శించారు. ఇది ముమ్మాటికీ హత్యేనని...ఇందులో జమ్మలమడుగు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయణ రెడ్డి హస్తం వున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

ఐటీ గ్రిడ్ ద్వారా ఇప్పటివరకు కేవలం ఓట్లను మాత్రమే తొలగించిన టిడిపి...తాజాగా మనుషులను కూడా తొలగించడం మొదలుపెట్టిందన్నారు. మాజీ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం తమ పార్టీలో కీలక నాయకులుగా కొనసాగుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని...ఆయన మృతి వార్త తెలియగానే తానెంతో ఆవేధనకు లోనయ్యానని విష్ణు పేర్కొన్నారు. 

మరో వైసిపి నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా టిడిపి ప్రకటించినప్పటి నుండే ఈ హత్యకు కుట్ర జరిగిందన్నారు. పెద్ద తలకాయల  ప్రమేయమున్న ఈ కేసులో సిట్ నిష్పక్షపాతంగా విచారణ జరపలేదని....అందుకే ఈ కేసును సిబిఐ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పై గెలవలేనని తెలిసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హత్యలను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లంపల్లి ఆరోపించారు.