చీరాల:  త్వరలోనే చీరాల ప్రజలు మంచి వార్తను వింటారని వైసీపీ నేత కరణం వెంకటేష్ చెప్పారు.వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు  చీరాలలో వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తర్వాత ఆయన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

అబద్దాలు చెప్పే కుటుంబం తనది కాదన్నారు. చాలా మంది అనేక కుతంత్రాలు చేస్తుంటారు వాటిని పట్టించుకోవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు.

also read:చీరాల గొడవపై జగన్ సీరియస్: రంగంలోకి సజ్జల

వైసీపీకి చెందిన చీరాల నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ నుండి వైసీపీలో చేరిన తర్వాత  మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు మధ్య గొడవలు సాగుతున్నాయి. వారం రోజుల క్రితం పందిళ్లపల్లిలో జరిగిన గొడవపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది.

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు.వీరిద్దరి మధ్య చోటు చేసుకొన్న గొడవల విషయమై ఆరా తీశారు.

జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడ ఈ గొడవ విషయమై పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు సీఎం జగన్ కు కూడ నివేదికను పంపారు. 

సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయిన  వారం రోజుల తర్వాత కరణం వెంకటేష్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.