ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కులం, మతం, పార్టీ అన్న తేడా చూడకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ వాస్తవాలను రామోజీరావు తెలుసుకోవాలని, ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కరోనాపై ఏపీలో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా ఈనాడు పత్రికలో వార్తలు రాస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇలా డబుల్ స్టాండ్ విధానం ఎందుకని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈనాడు, ఎల్లో మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని జగన్ ఆచరణలో చూపిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు.

కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. జగన్ పాలన చూసి టీడీపీ నేతలు ఈర్ష్య పడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

బుధవారం ఉదయం బెంజ్ సర్కిల్ దగ్గర సన్నివేశం చూసి ప్రజలు పరవసించిపోయారన్న ఆయన.. 108 వాహనాలు మళ్లీ అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా 108, 104, ఆరోగ్యశ్రీలను పూర్తిగా నిర్వీర్యం చేశారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు. కోవిడ్ నియంత్రణకు ఏపీలో తీసుకుంటున్న జాగ్రత్తలు మరెక్కడా తీసుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. వైశ్రాయ్ హోటల్‌ మాదిరిగా పార్క్‌హయత్‌లో ప్రభుత్వంపై కుట్రకు ప్లాన్ చేశారని ఆయన విమర్శించారు.