జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరు విలన్లయితే జగన్ అసలు సిసలైన హీరో అని అవినాష్ అన్నారు.
విజయవాడ : విలన్లు ఎంతమంది కలిసినా హీరో ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని వైసిపి నేత దేవినేని అవినాష్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో వున్న ఏకైక హీరో జగన్ మాత్రమేనని అన్నారు. బైబై జగన్ అంటున్న పవన్ కు గతంలోనే చంద్రబాబు, లోకేష్ కు ప్రజానీకం బైబై చెప్పిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. టీడీపి, జనసేన పార్టీలకు ప్రజలు ఎప్పుడో బై బై చెప్పేసారని అవినాష్ అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి అరిచినా ప్రజలంతా జగన్ వైపే ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అవినాష్ అన్నారు. ఇకనైనా సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలడం ఆపాలని... లేదంటే ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు.
40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సిఎం జగన్ ను చూసి పాలన నేర్చుకోవాలని అవినాష్ సూచించారు. సచివాలయ వ్యవస్ధ ద్వారా నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పధకాలు తీసుకువెళుతున్న ఘనత సిఎంకే దక్కుతుందని అన్నారు. ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా జగనన్న సురక్ష ఉందని... 11 అంశాలపై సమస్యలకు పరిష్కారం చూపుతుందని అన్నారు.
టీడీపి హయాంలో సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులలో బీరువాలు నిండిపోయేవి... వైసీపీ హయాంలో మాత్రం ఒక్క ఫోన్ కాల్ తోనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అవినాష్ అన్నారు. గత టిడిపి హయాంలో సమస్యలను పట్టించుకొనే వారు కాదు...కానీ వైసిపి హయాంలో సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయన్నారు.
జనసేనాని పవన్ ది వారాహి కాదు నారాహి యాత్ర అంటూ అవినాష్ ఎద్దేవా చేసారు. జగన్ ను గద్దె దించడానికి చంద్రబాబు, పవన్ తెగ తాపత్రయపడుతున్నారని అన్నారు. విలన్లు ఎంతమంది కలిసినా హీరోను ఏం చేయలేరు... అలాంటి హీరోనే జగనే అని అవినాష్ అన్నారు.
ఇక టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైనా అవినాష్ మండిపడ్డారు. ఆయన షో రాజకీయాలకు తప్ప ఎందుకు పనికిరాడన్నారు. ప్రజాప్రతినిధి అయిఉండి కార్యకర్తలను చెడు వ్యసనాలకు బానిస చేస్తూ తన వైపు తిప్పుకుంటున్నాడని అన్నారు. టీడీపి నేతల వైఖరి గమనించే ప్రజలు వారికి సరైన గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా మరల వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని దేవినేని అవినాష్ స్పష్టం చేసారు.
