ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆంధ్రాను వైసీపీ వైరస్ అనే తెల్ల దోమ పట్టి పీడిస్తోందన్నారు. కేసులున్న ముఖ్యమంత్రి రైతుల కోసం ఎలా పోరాడతాడని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని మరోసారి టార్గెట్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. తాను ద్వారంపూడి కుటుంబానికి తాను వ్యతిరేకం కాదన్నారు. అలాగే వైసీపీ నాయకులకు తాను వ్యతిరేకం కాదని, తాను మీతో గొడవ పెట్టుకోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అన్నం పెట్టే రైతు కష్టాన్ని ద్వారంపూడి కుటుంబీకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. బియ్యం ఎగుమతుల్లో ద్వారంపూడి కుటుంబం తమను తాము రారాజులుగా ఫీల్ అవుతోందని చురకలంటించారు.
తాను కులాల గురించి మాట్లాడుతున్నానని కొందరు మండిపడుతున్నారని .. మరి అమరావతిని ఒక కులానికే చెందినదిగా ముద్ర వేయడం కరెక్టా అన్నారు. మీకు గూండాలు , డబ్బులు వున్నాయని బలిసి కొట్టుకుంటున్నారని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక కులం గురించి , ఆడపడుచులను ఇష్టం వచ్చినట్లు అనొచ్చా అని జనసేన ప్రశ్నించారు. తాను ఇలాగే మాట్లాడతానని ఇబ్బందులున్నా భరించాలని వైసీపీ నాయకులను కోరారు. ఒకటి రెండు కులాలే ఆర్ధిక వ్యవస్థను చెప్పు చేతల్లో పెట్టుకోవడం కుదరదని, అన్ని కులాలు పైకి రావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ఐక్యంగా లేకపోతే మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని జనసేనాని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా నిలబడతా , గొడవ పడతానని ఆయన స్పష్టం చేశారు. ఓడిపోతానని తెలిసి క్రిమినల్ గ్యాంగ్‌తో గొడవ పెట్టుకుంటున్నానని పవన్ అన్నారు. తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదని .. గత ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినా వద్దన్నాని తెలిపారు. తనకు ఎలాంటి రక్షణ అక్కర్లేదని.. తన తల్లి వారాహియే రక్షణ అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సరైన వసతులు లేవని, జనసేన అధికారంలోకి వస్తే వాటిని నిజమైన రైతు భరోసా కేంద్రాలుగా చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ఉభయ గోదావరి జిల్లాలకు పవన్, జనసేన అండగా వుంటుందని.. రాజకీయం చేయాలంటే పెట్టి పుట్టక్కర్లేదని, గుండె వుంటే చాలన్నారు. గత ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారని కానీ ఏం జరిగిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అప్పుడు కూడా తన సభలకు భారీగా జనం వచ్చారని.. కానీ ఓటు మాత్రం వైసీపీకే వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ గెలిచివుంటే ఇక్కడి రైతాంగం కన్నీళ్లు పెట్టే అవసరం వుండేది కాదన్నారు.
ఆంధ్రాను వైసీపీ వైరస్ అనే తెల్ల దోమ పట్టి పీడిస్తోందన్నారు. మూడు పంటలు పండించాల్సిన రైతులు.. ఒక్క పంటకే పరిమితమయ్యారని , 50 నుంచి 60 వేల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారని పవన్ కల్యాణ్ చెప్పారు. తనకు ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు వున్నాయని గుర్తుచేశారు. కేసులున్న ముఖ్యమంత్రి రైతుల కోసం ఎలా పోరాడతాడని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే తనకేం నష్టం లేదని.. మీకే నష్టమని జనసేనాని పేర్కొన్నారు.
