అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య. చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. 

చంద్రబాబు నాయుడు మైండ్ కరప్ట్ అయిపోయిందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పోరాడే శక్తి లోపించిందన్నారు. వ్యూహాత్మకంగా టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపి అదేదో గొప్ప రాజకీయం చేశానని అనుకుంటున్నావంటూ మండిపడ్డారు.  

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారు కోవర్టులేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారు శుద్దులు చెప్తున్నారంటూ మండిపడ్డారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోడ్రైవర్లకు ఒక్కోక్కరికి పదివేల రూపాయలు ఇవ్వడం ఒక చరిత్ర అంటూ కొనియాడారు. 

అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘన చరిత్ర వైయస్ జగన్ దేనని చెప్పుకొచ్చారు. ఈనెల 15న రాష్ట్రంలోని రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఈనెల 10న కంటివెలుగు కిందఅందరికి కంటిపరీక్షలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. దాంతోపాటు నవంబర్ 21న మత్స్యకారులకు, ఉగాదికి ఇళ్లస్దలాలు ఇవ్వాలని జగన్ అధికారులకు ఆదేశించారని స్పష్టం చేశారు.  

వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తోందో అనేది ఈ కార్యక్రమాలను బట్టే తెలుస్తుందని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హామీలే మహాయజ్ఞంగా జగన్ ముందుకు వెళ్తున్నారని సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. 

చంద్రబాబుకి వీలుంటే ప్రజా సమస్యలపై స్పందించాలే తప్ప ఓడిపోయినా సంబబంధం లేని అంశాల గురించి మాట్లాడితే ఎలా అని నిలదీశారు. దుర్గ గుడిలో ,శ్రీకాళహస్తిలో క్షుద్రపూజలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. 

దుర్గ గుడికి సంబంధించిన భూములను నీకిష్టమైన వారికి కట్టబెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కిరీటం పోయింది చంద్రబాబు నాయుడు హయాంలో కాదా అని నిలదీశారు.  

తిరుమల తిరుపతి దేవస్థానంలో సీఎం జగన్ సంతకం పెట్టారా లేదా అనేది వ్యక్తిగత అంశమన్నారు. ప్రజలకు సంబంధించిన అంశం కాదని చెప్పుకొచ్చారు. స్వామిదగ్గరకు వెళ్లే వ్యక్తికి భక్తి ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు.   

సీఎం వైయస్ జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ ఇతర మతాలను గౌరవిస్తూ ఆలయ మర్యాదలను ఫాలో అవుతున్నారని తెలిపారు. తిరుపతే కాదు రాష్ట్రంలోని పవిత్ర ఆలయాలను సందర్శించిన సీఎం జగన్ నియమాలను ఫాలో అవుతున్నారని తెలిపారు.  

రుషికేష్‌ కు వెళ్లారని బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు ఇచ్చేందుకు వెళ్లారని గుర్తు చేశారు. 23 సీట్లతో ఉన్న చంద్రబాబు తన ఆలోచనా సరళిని మార్చుకోవాలని హితవు పలికారు.  ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యామో తెలుసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారంటూ తిట్టిపోశారు సి.రామచంద్రయ్య.  

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిలా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం లేదని చైల్డీష్ గా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయాలంటే సేవ చేయడమేనని చెప్పుకొచ్చారు. సదావర్తి భూములు పెద్ద స్కామ్ అని, విజయవాడలో 40 ఆలయాలను పడగొట్టింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. తిరుమలలో పోటును తవ్వించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదేనని మండిపడ్డారు.  

తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ మీడియాలో బూతులు చదవడం చంద్రబాబు నాయుడు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఎవరో వల్గర్ గా పోస్టులు పెడితే చదివి రాష్ట్రప్రజలకు వినిపిస్తారా అంటూ తిట్టిపోశారు. 

ఒక జంటిల్మన్ ఇలానే ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. వ్యక్తుల నైతికతపై లేనిపోని దుష్ప్రచారం చేయడం నీచమైన సంస్కృతి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి నీచ సంస్కృతికి మర్రి విత్తనం లాంటి వాడు చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. 

40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు 40 ఏళ్ల విషవృక్షమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సి.రామచంద్రయ్య మండిపడ్డారు.