తాను పార్టీ మారుతానంటూ జరుగుతోన్న ప్రచారంపై మరోసారి స్పందించారు వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి. తాను ఎట్టి పరిస్ధితుల్లో టీడీపీలో చేరబోనని స్పష్టం చేశారు. నారా లోకేష్‌ను కలిసినట్లు ఆధారాలు చూపాలని బైరెడ్డి డిమాండ్ చేశారు 

టీడీపీలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారంపై మరోసారి స్పందించారు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి. తెలుగుదేశంలో చేరేది లేదని.. నారా లోకేష్‌ను కలిసినట్లు ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆర్ధర్‌ది స్థానిక ప్రోటోకాల్ అని.. తనది రాష్ట్రవ్యాప్త ప్రోటోకాల్ అని బైరెడ్డి వెల్లడించారు. అందుకే ఇద్దరం కలవలేకపోతున్నామని.. అమ్మ ఒడి, నాడు-నేడు పనులకు తనకు సంబంధం లేదని సిద్ధార్ధ్ రెడ్డి స్పష్టం చేశారు. 

పదునైన మాటలు, విలక్షణ వ్యక్తిత్వంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి యూత్ ఫాలోయింగ్ సాధించిన భైరెడ్డి సిద్దార్థరెడ్డి (byreddy siddarth reddy) రాజకీయంగానూ మంచి స్థాయిలో వున్నారు. చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) దృష్టిలో పడి ఇటీవలే షాప్ ఛైర్మన్ గా నామినేటెడ్ పదవిని కూడా పొందాడు. ఇలా వైసిపి (ysrcp)లో మంచి గుర్తింపు వుండగా బైరెడ్డి టిడిపి (TDP) వైపు చూస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) తో కూడా రహస్యంగా సమావేశమై టిడిపి చేరడానికి సిద్దార్థ్ ఆసక్తి చూపినట్లుగా ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం తన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై సిద్దార్థ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

తాను కష్టకాలంలో వుండగా పార్టీలో చేర్చుకుని ఓ వేదికను ఇచ్చిన వైఎస్ జగన్ వెంటే జీవితాంతం వుంటానని సిద్దార్థ్ తెలిపారు. తనను తమ్ముడిలా చూసుకుంటూ మంచి అవకాశాలు కల్పిస్తున్న జగనన్నను దూరం చేసుకుని వైసిపి నుండి టిడిపిలోకి జంప్ అయ్యే అవసరం తనకు లేదన్నారు. తాను ఎప్పటికీ వైఎస్ జగన్ విధేయుడినే... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తనదని సిద్దార్థ్ అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని... అందుకు కొన్ని మీడియా సంస్థలు సహకరిస్తున్నాయని తెలిపారు. తాను టిడిపిలో చేరుతున్నట్లు వార్తలన్నీ అవాస్తమేనని... తనకెంత గడ్డు పరిస్థితులు ఎదురయినా వైసిపిని వీడబోనని బైరెడ్డి స్పష్టం చేసారు. 

పార్టీలో చేర్చుకుని అతిచిన్న వయసులోనే నందికొట్కూరు (nandikotkuru) ఇంచార్జి బాధ్యతలు అప్పగించి, అధికారంలోకి వచ్చాక షాప్ ఛైర్మన్ పదవి ఇచ్చి ఇలా సీఎం జగన్ తనకెంతో చేసారన్నారు. ఇన్ని అవకాశాలిచ్చిన పార్టీని తానెందుకు వీడతాను... ఆ ఆలోచన కూడా రానివ్వనని అన్నారు. రాజకీయంగా నేనంటే గిట్టనివారు... కొన్ని మీడియా సంస్థలు బ్రేకింగ్ ల కోసమే ఇలా పార్టీ మారుతున్నానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని సిద్దార్థ్ మండిపడ్డారు. 

అప్పుడెప్పుడో తాను వైసిపిలో చేరకముందు నారా లోకేష్ ను కలిసానని... పార్టీని కాపాడుకున్న కార్యకర్తలను కాపాడుకోవాలని కోరినట్లు సిద్దార్థ్ గుర్తుచేసారు. అయితే తనలాంటి యువకులు టిడిపికి అక్కర్లేదని... డబ్బులు ఖర్చుపెట్టేవారే కావాలని వేరేవారిని లోకేష్ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. కానీ వైఎస్ జగన్ అలా కాకుండా యువకుడినైన తనను వెన్నుతట్టి ప్రోత్సహించి ఏకంగా ఓ నియోజవర్గ ఇంచార్జిగా నియమించి పార్టీ గెలుపు బాధ్యతను తనకు అప్పగించారన్నారు. తనను ఇంతలా నమ్మిన జగన్ నాయకత్వంలో ఎప్పటికీ పనిచేస్తానని బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్ఫష్టం చేసారు.