ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీవి దొంగ దీక్షలు: బొత్స

First Published 25, Jun 2018, 3:57 PM IST
Ysrcp leader Bosta Satyanarayana fires on Tdp
Highlights

ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టీడీపీపై బొత్స హట్ కామెంట్స్


హైదరాబాద్: నాలుగేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగిన టిడిపి నేతలు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు నోరు మెదపలేదని  మాజీ మంత్రి , వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఇంతకాలం పాటు నోరు మూసుకొన్న టీడీపీ నేతలు  ఇవాళ  దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించాలని డిమాండ్ చేస్తూ  టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న కాలంలో ఈ విషయం ఎందుకు గుర్తుకు లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

నీతి ఆయోగ్ సమావేశం తర్వాత  మంత్రులు కానీ, టీడీపీ నేతలు కానీ ప్రధానమంత్రి మోడీని కానీ, బీజేపీ నేతలను ఎందుకు విమర్శించడం లేదో చెప్పాలన్నారు. నీతి ఆయోగ్  సమావేశం జరిగి 9 రోజులైనా రాష్ట్రానికి ఒక్క పైసా నిధులు రాలేదని ఆయన చెప్పారు.టీడీపీ, బీజేపీ నేతల మధ్య రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  

టీడీపీ, బీజేపీ నేతలు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.  కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని లోక్‌సభ, రాజ్యసభలో పోరాటం చేయకుండా కడపలో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు.
 

loader