విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది అని, అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరంటూ మండిపడ్డారు.  

విజయవాడలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబు పతనం హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైందన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. మా పుట్టలో వేలుపెడితే...మీ పుట్టలో కాలుపెడతామని కేటీఆర్‌ అంటే దానిని తమకు ఆపాదిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. 

కేసీఆర్‌ను అమరావతి శంకుస్థాపనకు పిలిచింది మీరు కాదా, మిమ్మల్ని పిలవకపోయినా కేసీఆర్‌ చేసిన యాగానికి ఎగేసుకొని వెళ్లింది నిజం కాదా అని అంబటి చంద్రబాబును నిలదీశారు. కేటీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య లగడపాటి రాజగోపాల్‌ బ్రోకర్‌ పనిచేశారని విమర్శించారు. 

ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ భౌతికకాయం వద్దే టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారని, టీఆర్‌ఎస్‌ ఛీ.. పో.. అన్న తర్వాతే ఆయన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని అంబటి గుర్తుచేశారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజల కన్నీటికి కారణమైన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటారా అంటూ చంద్రబాబుపై విరచుకుపడ్డారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి తానే కారణమని చంద్రబాబు చెప్తున్నారని, మరి ఏ ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా చంద్రబాబు వల్లే తాము గెలిచామని ఎందుకు చెప్పడంలేదన్నారు. 

చంద్రబాబు ఏపీలో దోచుకున్న సొమ్ముతో కాంగ్రెస్‌ పార్టీకి పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికలకు ముందు అశోక్‌ గెహ్లాట్ డబ్బు గురించే అమరావతికి వచ్చారనే విషయం నిజం కాదా అని నిలదీశారు. అడ్డగోలుగా దోచుకున్న అవినీతి డబ్బుతో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబటి మండిపడ్డారు.  

మరోవైపు లగడపాటి రాజగోపాల్, సినీనటుడు శివాజీ ఇద్దరూ చంద్రబాబు నాయుడు అస్త్రాలేనంటూ విమర్శించారు. ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త చంద్రబాబేనని చెప్పారు. ఎన్నికల చివరి నిమిషంలో తెలంగాణ ప్రజల మనసులు మార్చడానికి లగడపాటి రాజగోపాల్‌ని చంద్రబాబు ప్రయోగించారని తెలిపారు. 

శివాజీ అమెరికా పారిపోయి మళ్లీ వచ్చాడని అలాగే దివాలా తీసిన రాజగోపాల్, దోచుకున్న సొమ్ముతో సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా దేశం విడిచి పారిపోతారని అంబటి ఆరోపించారు.