చంద్రబాబు ఎజెండాలో భాగంగానే ఎస్ఈసీ పర్యటనలని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు నిమ్మగడ్డ తాపత్రాయ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎస్ఈసీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని.. గతంలో ఎప్పుడే ఇలాంటి ఎస్ఈసీని చూడలేదని అంబటి వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ ప్రజాస్వామ్యవాది కానే కాదని.. ఆయన పచ్చి రాజకీయవాదిగా వ్యవహరిస్తున్నారని రాంబాబు ఆరోపించారు.

Also Read:కడపకు వెళ్లింది ... హరికథ చెప్పడానికా: నిమ్మగడ్డపై బొత్స ఫైర్

టీడీపీని చిత్తుగా ఓడించారని వైఎస్సార్‌సీపీపై నిమ్మగడ్డ కక్ష సాధిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటున్నాయని అంబటి మండిపడ్డారు. దివంగత నేత వైఎస్సార్‌ అంటే తనకు అభిమానమని నిమ్మగడ్డ అంటున్నారు.. 2009లో ఆయన మరణిస్తే 2021లో నిమ్మగడ్డకు అభిమానం పుట్టుకొచ్చిందంటూ సెటైర్లు వేశారు.

వైఎస్సార్‌ విగ్రహాలకు ముసుగు వేయించి, పొగుడుతారని... కడప ఎన్నికల రివ్యూకు వెళ్లి సీబీఐ కేసుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిమ్మగడ్డను ప్రశ్నించారు. పెన్ను, కాగితం ఉందని లేఖలు రాయడంతో పాటు మీడియాకు లీక్ ఇస్తున్నారంటూ అంబటి మండిపడ్డారు.