ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎందుకు లేఖలు రాస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన గవర్నర్‌తో నియమించబడ్డ వ్యక్తి లేఖలు రాయడం ఏంటని ప్రశ్నించారు.

బెదిరింపులకు పాల్పడుతున్నారనే నిరాధారమైన ఫిర్యాదులు చేస్తున్నారని.. ఏకగ్రీవాల స్పూర్తికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. అలా చేసేకంటే అసలు ఏకగ్రీవాలే లేవని ప్రకటించాలని మంత్రి డిమాండ్ చేశారు.

కడపకు నిమ్మగడ్డ  వెళ్లింది ఎన్నికలపై సమీక్షించడానికా..? హరికథ చెప్పడానికా అంటూ బొత్స సెటైర్లు వేశారు. ఎన్ని దుష్టశక్తులు ఎదురైన 99 శాతం విజయం వైసీపీదేనని ఆయన జోస్యం చెప్పారు. నిమ్మగడ్డపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చామని.. నిమ్మగడ్డపై చర్యలు తీసుకొని, హక్కులు కాపాడాలని స్పీకర్‌ను కోరామని బొత్స వెల్లడించారు. 

కాగా, తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ నిన్న గవర్నర్‌కు లేఖ రాశారు. 

తాజాగా నిమ్మగడ్డకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు కౌంటర్ ఇచ్చారు.. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.

ఈ మేరకు శనివారం శాసనసభ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు అందజేశారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని.. ఆయన వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.