కర్నూల్: కర్నూల్ జిల్లా పత్తికొండ- చిన్న హుల్తీ రహదారిలో బుధవారం నాడు సీపీఐ నేత రాంభూపాల్ రెడ్డిపై వైఎస్ఆర్‌సీపీ నేత అమర్ నాథ్ రెడ్డి సినీ ఫక్కీలో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో  తీవ్ర గాయాలపాలైన రాంభూపాల్ రెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సీపీఐ నేత రాంభూపాల్ రెడ్డిని జీపుతో ఢీకొట్టి  ఇనుప రాడ్లతో కొట్టి చంపేందుకు వైసీపీ నేత అమర్ నాథ్ రెడ్డి ప్రయత్నించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అంతేకాదు తుపాకీతో అమర్ నాథ్ రెడ్డి కాల్చేందుకు ప్రయత్నించారని సీపీఐ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, సీపీఐ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో  అమర్ నాథ్ రెడ్డి పారిపోయాడు.

అమర్ నాథ్ రెడ్డి దాడిలో సీపీఐ నేత రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయం తెలిసిన సీపీఐ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకొంటున్నారు.  దీంతో ఉద్రిక్తత నెలకొంది.అమర్ నాథ్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి మధ్య కొంత కాలంగా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నట్టుగా  స్థానికులు చెబుతున్నారు.