విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తదితర విభజన హామీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నడూ ప్రధానిని నిలదీయలేదన్నారు వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కేవలం ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో లభ్ధి పొందేందుకే చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.

నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని తెలిపారు. హోదా కోసం రాష్ట్రంతో పాటు ఢిల్లీలోనూ ఆందోళనలు చేసినట్లు సుబ్బారెడ్డి గుర్తు చేశారు. తమ చర్యల వల్లే ప్రత్యేకహోదా సజీవంగా ఉందన్నారు.

రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోందని తమకు చెల్లించాల్సిన రూ.2,219 కోట్లు కట్టాల్సిందిగా నేషనల్ ధర్మల్ పవర్ కార్పోరేషన్ నోటీసులు జారీ చేసిందని సుబ్బారెడ్డి తెలిపారు. వివిధ సంస్థలకు చెల్లించాల్సిన ప్రజాధనాన్ని ఛార్టెడ్ విమానాలకు, ధర్మపోరాట దీక్షలకు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రుణాలు చెల్లించేందుకు గాను బాండ్లను విడుదల చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లలో మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ చేపట్టాలన్నా బాండ్లే దిక్కని...అభివృద్ది అంతా అప్పుల్లో ఉందని సుబ్బారెడ్డి ఆరోపించారు. అప్పులు చెల్లించకుండా కాంట్రాక్టర్లకు మాత్రం ముందుగానే బిల్లులు క్లియర్ చేస్తున్నారన్నారు.