హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అజ్ఞాత వాసి ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. జగన్ పీఏ పేరుతో ఫోన్ కాల్ చెయ్యడమే కాకుండా డబ్బు పంపించాలంటూ వాట్సప్ మెసేజ్ లు కూడా పంపించడం ఆ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. 

డబ్బులు పంపించాలంటూ ఇప్పటికే దాదాపు 15 మంది సమన్వయకర్తలకు ఫోన్లు వెళ్లాయని, డబ్బులు ఇవ్వకపోతే పరిస్థితి వేరులా ఉంటుందని బెదిరింపులకు సైతం పాల్పడ్డారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

రాష్ట్రంలోని వైసీపీ నేతలనే కాకుండా ఢిల్లీలోని పలువురు ప్రముఖులకు ఫోన్ కాల్స్, మెసేజ లు చేస్తుండటం ఆ పార్టీని ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండగా తమకు సంబంధం లేకుండా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ పార్టీ గందరగోళంలో పడింది. 

ఇకపోతే తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజాకు జగన్న పీఏ పేరుతో ఫోన్ కాల్ చెయ్యడమే కాకుండా డబ్బు పంపించాలంటూ వాట్సప్ మెజేస్ కూడా పంపించారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. వైసీపీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ ఆరోపించింది. 

ఇలాంటి కుట్రలను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్ వేసింది. పార్టీ ఐటీ సెల్ నాయకుడు ఏ హర్షవర్ధన్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు హైదరాబాద్ సీపీ అంనీకుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. 

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్‌ రెడ్డి పేరును ఆయన ఫోన్ నంబరును దుర్వినియోగం చేస్తూ ఆయన పేరుతో  పార్టీ నేతలకు ఫోన్లు, మెస్సేజీలు పంపిస్తూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఫిర్యాదును స్వీకరించిన అంజనీ కుమార్‌ కేసును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బదిలీ చేశారు.

రాజకీయంగా వైఎస్‌ జగన్‌ కు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని తట్టుకోలేక ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లోటస్‌పాండ్‌ పేరిట ఆగంతకుడి నెంబర్‌ రిజిస్టర్‌ అయ్యిందని, అందుకే హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు.